LOADING...
Maruti Suzuki: రైళ్లలో 30 లక్షల కార్లు పంపిన మారుతి సుజుకి.. డెలివరీల్లో భారీ మార్పులు
రైళ్లలో 30 లక్షల కార్లు పంపిన మారుతి సుజుకి.. డెలివరీల్లో భారీ మార్పులు

Maruti Suzuki: రైళ్లలో 30 లక్షల కార్లు పంపిన మారుతి సుజుకి.. డెలివరీల్లో భారీ మార్పులు

వ్రాసిన వారు Moogati Shabari
May 14, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ లాజిస్టిక్స్ రంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. భారతీయ రైల్వేల ద్వారా 30 లక్షలకు పైగా వాహనాలను రవాణా చేసినట్లు కంపెనీ వెల్లడించింది. గత పదేళ్లుగా రైల్వే నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్న మారుతి సుజుకి, ఇటీవల కాలంలో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఖర్చులను తగ్గించడం, కాలుష్య ఉద్గారాలను నియంత్రించడం, హైవేలపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించడం లక్ష్యంగా రైల్వే రవాణాపై మరింత దృష్టి పెట్టింది.

వివరాలు

రైల్వే ద్వారా డెలివరీలు మరింత సులభం..

గత పదేళ్లలో రైల్వేల ద్వారా తరలించిన వాహనాల వాటా కంపెనీ మొత్తం డిస్పాచ్‌లలో సుమారు 5 శాతం నుంచి దాదాపు 25 శాతానికి పెరిగింది. రైల్వేలను తమ పంపిణీ వ్యవస్థలో కీలక భాగంగా మార్చాలనే వ్యూహంతో కంపెనీ ముందుకు సాగుతోంది. రెండు మిలియన్ల నుంచి మూడు మిలియన్ల వాహనాల రైల్వే డిస్పాచ్‌ల మైలురాయిని కేవలం 21 నెలల్లోనే చేరుకోవడం విశేషం. ఇప్పటివరకు కంపెనీకి ఇది అత్యంత వేగంగా నమోదైన మిలియన్ వాహనాల పెరుగుదలగా నిలిచింది. దీని వల్ల డీలర్లు, వినియోగదారులకు వాహనాల డెలివరీ సమయాలు మరింత స్థిరంగా మారాయని కంపెనీ తెలిపింది. వర్షాలు, టోల్ ఆలస్యాలు, హైవే ట్రాఫిక్ వంటి సమస్యల ప్రభావం రైల్వే రవాణాపై తక్కువగా ఉండటంతో డెలివరీలు సులభంగా జరుగుతున్నాయి.

వివరాలు

600కు పైగా నగరాలకు వాహనాలు పంపిణీ..

ఆటోమొబైల్ ఫ్రైట్ ట్రైన్ ఆపరేటర్ (AFTO) లైసెన్స్ పొందిన తొలి భారతీయ ఆటోమొబైల్ కంపెనీగా కూడా మారుతి సుజుకి నిలిచింది. దీంతో జాతీయ రైల్వే నెట్‌వర్క్‌లో అధిక సామర్థ్యంతో కార్లను తరలించే ప్రత్యేక రేకులను నిర్వహించే అవకాశం కంపెనీకి లభించింది. హర్యానాలోని మానేసర్, గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్లలో ప్రత్యేక రైల్వే సైడింగ్ సదుపాయాల కోసం కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఈ రెండు కేంద్రాలు కలిపి ఏడాదికి సుమారు 7.5 లక్షల వాహనాలను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. దీంతో దూర ప్రాంతాల లోడింగ్ పాయింట్లకు ట్రక్కుల ద్వారా కార్లను తరలించే అవసరం గణనీయంగా తగ్గింది. ఈ ప్లాంట్ల నుంచి 22 డిస్ట్రిబ్యూషన్ హబ్‌ల ద్వారా 600కి పైగా నగరాలకు వాహనాలు పంపిణీ అవుతున్నాయి.

Advertisement

వివరాలు

2070 నాటికి భారీగా టార్గెట్..

మారుతి సుజుకి చేపట్టిన "గ్రీన్ లాజిస్టిక్స్" కార్యక్రమంలో కూడా రైల్వే రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. రైల్వేల వినియోగం పెరగడంతో వేల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయినట్లు కంపెనీ తెలిపింది. ఇది దేశం నిర్దేశించుకున్న చమురు దిగుమతుల తగ్గింపు, 2070 నాటికి నెట్-జీరో లక్ష్యాలకు కూడా తోడ్పడనుంది. 2030-31 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు 40 లక్షల యూనిట్లకు పెంచే లక్ష్యంతో మారుతి సుజుకి ముందుకు సాగుతోంది.

Advertisement

వివరాలు

మరో 8 ఏళ్లల్లో భారీగా వాటా..

వచ్చే 7 నుంచి 8 సంవత్సరాల్లో రైల్వేల ద్వారా జరిగే వాహన డిస్పాచ్‌ల వాటాను సుమారు 35 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాహన కొనుగోలుదారుల దృష్టిలో ఈ మార్పులు ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కొత్త కార్లు షోరూమ్‌లకు ఎంత వేగంగా, ఎంత నమ్మకంగా చేరుతున్నాయన్న విషయంలో ఇవి కీలక ప్రభావం చూపుతున్నాయి. మారుతి సుజుకికి ఈ 30 లక్షల మైలురాయి అంటే కేవలం సంఖ్య మాత్రమే కాదు.. శుభ్రమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ వైపు కంపెనీ వేస్తున్న పెద్ద అడుగుగా భావిస్తున్నారు.

Advertisement