Mercedes-Benz: భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ సేల్స్ రికార్డ్… విశాఖలో కొత్త షోరూమ్
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత మార్కెట్లో కొత్త రికార్డ్ నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 19,363 కార్లు విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 2.29 శాతం వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది 18,928 యూనిట్లు విక్రయించిన సంగతి తెలిసిందే. ఇక 2026 జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికంలో కూడా 5,131 కార్లు అమ్ముడై 7.45 శాతం వృద్ధి నమోదైంది.భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ సేల్స్ రికార్డ్... విశాఖలో కొత్త షోరూమ్
వివరాలు
టాప్ లగ్జరీ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్
కంపెనీ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణం టాప్-ఎండ్, కోర్ లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ అని వెల్లడించింది. టాప్ లగ్జరీ సెగ్మెంట్‌లో అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం, మార్చి త్రైమాసికంలో 25 శాతం పెరిగాయి. ఈ విభాగంలో Mercedes-Benz S-Class, Mercedes-Maybach మోడళ్లు, Mercedes EQS SUV, అలాగే Mercedes-AMG శ్రేణి ఉన్నాయి. మొత్తం అమ్మకాలలో ఈ సెగ్మెంట్ వాటా 27 శాతంగా ఉంది. ప్రత్యేకంగా Mercedes-AMG G63 వంటి మోడళ్లకు 4 నెలల నుంచి ఏడాది వరకు వెయిటింగ్ ఉందని కంపెనీ తెలిపింది.
వివరాలు
కోర్ సెగ్మెంట్ మోడళ్లకు స్థిరమైన ఆదరణ
కోర్ సెగ్మెంట్‌లోని Mercedes-Benz C-Class, Mercedes-Benz E-Class LWB సెడాన్లు, అలాగే Mercedes-Benz GLC, Mercedes-Benz GLE మోడళ్లు అమ్మకాల్లో కీలక పాత్ర పోషించాయి. ప్రత్యేకంగా ఈ-క్లాస్ లాంగ్ వీల్‌బేస్ మోడల్ భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ కారుగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. అయితే, తక్కువ ధర ఆఫర్లతో పోటీ పెరగడంతో ఎంట్రీ లగ్జరీ సెగ్మెంట్‌లో అమ్మకాలు 18 శాతం తగ్గినట్లు కంపెనీ తెలిపింది. కేవలం సంఖ్య పెంచుకోవడం కాకుండా, అత్యాధునిక ఫీచర్లతో కూడిన కార్లపై దృష్టి పెట్టామని స్పష్టం చేసింది.
వివరాలు
ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ గణనీయ వృద్ధి
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా కంపెనీ మంచి ప్రగతి సాధించింది. రూ.1.4 కోట్లకు పైబడిన టాప్ ఎండ్ ఈవీల అమ్మకాలు 85 శాతం పెరిగాయి. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఏప్రిల్ 24న Mercedes-Benz CLA Electric మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. విశాఖలో కొత్త ఔట్‌లెట్ 'గో టు కస్టమర్' వ్యూహంతో దేశవ్యాప్తంగా తన రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కంపెనీ సిద్ధమైంది. 2026లో 20కి పైగా కొత్త లగ్జరీ షోరూమ్‌లను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా విశాఖపట్టణంతో పాటు వారణాసివంటి నగరాల్లోకి ప్రవేశించనుంది. ఫ్రాంచైజ్ భాగస్వాములతో కలిసి వచ్చే రెండేళ్లలో రూ.450 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపింది.