Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్ ఇండియాకు రికార్డు అమ్మకాలు.. ఎలక్ట్రిక్ కార్లకు భారీ ఆదరణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరోసారి రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. 2026 రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్)తో పాటు తొలి ఆరు నెలల కాలంలో కంపెనీ ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత అత్యధిక అమ్మకాలను సాధించింది. లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మెర్సిడెస్ బెంజ్ రిటైల్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 10 శాతం పెరిగి 4,637 యూనిట్లకు చేరాయి. ఇక 2026 తొలి ఆరు నెలల్లో మొత్తం 9,768 వాహనాలను విక్రయించి కొత్త రికార్డు నెలకొల్పింది.
వివరాలు
29శాతం వృద్ధిని నమోదు చేసిన కంపెనీ ఎంట్రీ లగ్జరీ విభాగం
ఈ త్రైమాసికంలో కంపెనీ ఎంట్రీ లగ్జరీ విభాగం అత్యధికంగా 29శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన CLA బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు,GLA ఎస్‌యూవీకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా CLA ఎలక్ట్రిక్ కారు విడుదలైన కొద్ది రోజుల్లోనే పూర్తిగా బుక్ అయింది. ప్రస్తుతం ఈ మోడల్ కోసం ఐదు నుంచి ఆరు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ మొత్తం క్యూ2 రిటైల్ విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 14శాతానికి చేరింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు రెండింతలు. CLA ఎలక్ట్రిక్ కారు,EQS ఎస్‌యూవీకి పెరిగిన డిమాండ్ దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.
వివరాలు
కంపెనీ విక్రయాలకు ప్రధాన బలంగా నిలిచిన టాప్ ఎండ్ లగ్జరీ, కోర్ సెగ్మెంట్లు
రూ.1.4కోట్లకు పైబడిన టాప్ ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు కూడా ఈ త్రైమాసికంలో 85శాతం పెరిగాయి. మరోవైపు తొలి ఆరు నెలల కాలంలో టాప్ ఎండ్ లగ్జరీ, కోర్ సెగ్మెంట్లు కంపెనీ విక్రయాలకు ప్రధాన బలంగా నిలిచాయి. టాప్ ఎండ్ లగ్జరీ వాహనాల అమ్మకాలు 20 శాతానికి పైగా పెరగగా, ప్రస్తుతం కంపెనీ మొత్తం విక్రయాల్లో ఈ విభాగం వాటా రికార్డు స్థాయిలో 28 శాతానికి చేరుకుంది. ఈ విభాగంలో S-క్లాస్, మెర్సిడెస్-మేబాక్ మోడళ్లు, EQS ఎస్‌యూవీ, మెర్సిడెస్-AMG వాహనాలు, తాజాగా పరిచయమైన V-క్లాస్ ఉన్నాయి. పనితీరు ఆధారిత లగ్జరీ కార్లకు మంచి ఆదరణ కొనసాగడంతో మెర్సిడెస్-AMG విక్రయాలు తొలి ఆరు నెలల్లో 50 శాతం పెరిగాయి.
వివరాలు
S-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌కు కూడా మంచి డిమాండ్
S-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌కు కూడా మంచి డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. AMG లైన్ బుకింగ్స్ పూర్తిగా ముగిశాయి. ఎక్స్‌క్లూజివ్ లైన్ వాహనాలకు పండుగల సీజన్ డెలివరీల కోసం ఇప్పటికే పెద్దఎత్తున బుకింగ్స్ నమోదయ్యాయి. AMG G 63 వంటి టాప్ ఎండ్ మోడళ్ల కోసం ప్రస్తుతం నాలుగు నెలల నుంచి ఏడాది వరకు వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోంది. 2026 రెండోార్థంపైనా కంపెనీ ఆశావహంగా ఉంది. విక్రయ లక్ష్యాన్ని ప్రకటించకపోయినా దేశవ్యాప్తంగా విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వారణాసి, ముంబై, పుణె, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్ నగరాల్లో కొత్త షోరూమ్‌లు ప్రారంభించనుంది. మూడో త్రైమాసికంలోనే ఐదు కొత్త లగ్జరీ అవుట్‌లెట్లు ప్రారంభించే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
వివరాలు
వచ్చే రెండేళ్లలో 20కి పైగా కొత్త అవుట్‌లెట్లు
ఇప్పటికే తొలి ఆరు నెలల్లో బెంగళూరు, భోపాల్, రాయ్‌పూర్, గోవా, విశాఖపట్నంలో ఆరు కొత్త టచ్‌పాయింట్లను ఏర్పాటు చేసింది. వచ్చే రెండేళ్లలో 20కి పైగా కొత్త అవుట్‌లెట్లు ప్రారంభించడం, ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించడం కోసం ఫ్రాంచైజీ భాగస్వాములు రూ.450 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ దేశవ్యాప్తంగా 50కి పైగా నగరాల్లో 140కిపైగా టచ్‌పాయింట్ల ద్వారా సేవలు అందిస్తోంది.