MG Comet: ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన కామెట్ విద్యుత్ కారును బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌లో విడుదల చేసింది.
ఇప్పటికే హెక్టార్, గ్లోస్టర్, ఆస్టర్ వంటి మోడళ్లను ఈ ప్రత్యేక ఎడిషన్‌లో ప్రవేశపెట్టిన కంపెనీ, ఇప్పుడు ఈ చిన్న ఎలక్ట్రిక్ కారుకు నలుపు రంగు మెరుగు జోడించింది.
దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ.7.8 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ ధర బ్యాటరీ ఖర్చును మినహాయించి నిర్ణయించారు. బ్యాటరీతో కూడిన ఖచ్చితమైన ధరను కంపెనీ వెల్లడించలేదు.
బ్యాటరీ యాజ్ ఏ సర్వీసు విధానంలో ప్రతి కిలోమీటర్‌కు రూ.2.5 చెల్లించాల్సి ఉంటుంది.
కామెట్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ.4.99 లక్షలు (బ్యాటరీ రెంటల్ అదనం) కాగా, బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ధర దాదాపు 2.8 లక్షలు ఎక్కువ.
Details
రూ.11వేలు చెల్లించి బుక్ చేసుకోవాలి
కొత్త ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను రూ.11వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ ఎడిషన్‌లో బ్లాక్ కలర్‌పై ఎరుపు రంగు చారలు అందంగా మెరుస్తాయి.
ముందు భాగంలో వెడల్పాటి ఎల్‌ఈడీ స్ట్రిప్ క్రింద ఎంజీ లోగో ఉంటుంది. అంతర్గతంగా కూడా బ్లాక్ థీమ్‌ను అనుసరించారు. 12 అంగుళాల అలాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి.
కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్, హీటింగ్, ఫోల్డబుల్ ఔట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్స్, యూఎస్‌బీ పోర్ట్స్, 12V పవర్ ఔట్‌లెట్ వంటి ఫీచర్లు అందిస్తారు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది.
Details
230 కిలోమీటర్ల రేంజ్
మొత్తం 55 రకాల కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో లభ్యమవుతాయి. 17.3 kWh బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 41 hp పవర్, 110 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
7.4 kW ఛార్జర్‌తో 0-100 శాతం బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 3.5 గంటల సమయం పడుతుంది.