
MG Cyberster: కేవలం 3.2 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం సాధించగల సుపర్ కారు
ఈ వార్తాకథనం ఏంటి
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లోకి ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారును సైబర్‌స్టర్ పేరిట విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను ఎక్స్-షోరూమ్‌లో రూ. 74.99 లక్షలుగా నిర్ణయించారు. అయితే ముందుగా ప్రీ-బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు స్పెషల్ ప్రైస్‌గా రూ. 72.49 లక్షలకు అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో ఈ కారును తొలిసారిగా ప్రదర్శించారు. తాజాగా ఇది దేశవ్యాప్తంగా లాంచ్ అయింది. ఎంజీ సెలెక్ట్ ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాల్లో ఈ కారు వినియోగదారులకు లభ్యమవుతుంది.
వివరాలు
విభిన్నమైన డిజైన్ ఫీచర్లు
సైబర్‌స్టర్ ఓ 2 సీటర్ కేబిన్‌తో వస్తుంది. దీని ప్రత్యేకత ఫోల్డింగ్ సాఫ్ట్ టాప్ రూఫ్,ఆకర్షణీయమైన సిజర్ డోర్స్. ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, డీఆర్‌ఎల్స్‌తో పాటు వెనుకవైపు యారో ఆకారంలో ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్స్‌ను అందించారు. కారు రూపాన్ని ఇంకా మెరుగుపరచేందుకు 20 అంగుళాల తేలికపాటి అలాయ్ వీల్స్ ఏర్పాటు చేశారు.
వివరాలు
అధునాతన ఇంటీరియర్, టెక్నాలజీ హైలైట్స్
కారు లోపలి భాగంలో 10.25 అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. వీటి ద్వారా రియల్‌టైమ్ వెహికల్ సమాచారం, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు, సెట్టింగ్స్ వంటి అనేక అంశాలను వినియోగదారులు నియంత్రించవచ్చు. పీఎం 2.5 ఫిల్టర్‌తో కూడిన డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థను అందించడంవల్ల వాతావరణ అనుకూలత మరింత మెరుగ్గా ఉంటుంది.
వివరాలు
పవర్‌ఫుల్ పనితీరు
ఈ కారు హృదయంలో 77kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీనితో పాటు డ్యూయల్ మోటార్ ఆల్వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌ను కలిపారు. కేవలం 3.2 సెకన్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఈ కారుకు ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో సాగుతుంది.
వివరాలు
భద్రత, అదనపు ఫీచర్లు
భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఇందులో లెవల్ 2 ADAS సాంకేతికత, రియల్‌టైమ్ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్, సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా వినియోగదారుల ఎంపిక కోసం ఈ కారును నాలుగు వేర్వేరు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.