Bajaj Avenger 220 Street: మార్కెట్‌లోకి కొత్త బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ దేశీయ మార్కెట్‌లో అప్‌డేట్ చేసిన అవెంజర్ స్ట్రీట్ 220 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ క్రూయిజర్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించింది. ఇటీవల అవెంజర్ స్ట్రీట్ 160 మోడల్‌ను నిలిపివేసిన నేపథ్యంలో కొత్త స్ట్రీట్ 220ను మార్కెట్‌లోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రూయిజర్ సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన అవెంజర్ శ్రేణిలో ఈ మోడల్ తాజాగా బజాజ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చింది. అవెంజర్ 220 క్రూయిజ్ మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ.1,000 ఎక్కువగా ఉంది. కొత్త అవెంజర్ స్ట్రీట్ 220 ఎబోనీ బ్లాక్, కాక్‌టెయిల్ రెడ్ వైన్ రంగు ఎంపికల్లో లభ్యమవుతోంది.
వివరాలు
ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు
డిజైన్ పరంగా పెద్ద మార్పులు చేయకుండా, రౌండ్ హెడ్‌ల్యాంప్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్, ఎత్తైన హ్యాండిల్‌బార్ వంటి ప్రత్యేకతలను యథాతథంగా కొనసాగించారు. ఇందులో 220 సీసీ సామర్థ్యం గల ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 8,500 ఆర్‌పీఎం వద్ద 19 హెచ్‌పీ శక్తిని, 7,000 ఆర్‌పీఎం వద్ద 17 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. సస్పెన్షన్ వ్యవస్థ విషయానికి వస్తే, ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుక వైపు 5-స్టెప్ అడ్జస్ట్‌మెంట్ సదుపాయం కలిగిన ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను అందించారు.
వివరాలు
భద్రత కోసం సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ఫీచర్
బ్రేకింగ్ కోసం ముందువైపు 280 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక వైపు 130 ఎంఎం డిస్క్ బ్రేక్‌ను ఏర్పాటు చేశారు. భద్రత కోసం సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ఫీచర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. 13 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో వచ్చిన ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ మొత్తం బరువు 160 కిలోగ్రాములు.