New Toll policy: త్వరలో సరికొత్త టోల్ విధానం.. వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ సుంకాల్లో మార్పులు తీసుకువచ్చి, వినియోగదారులకు సమంజసమైన రాయితీలు అందించేందుకు త్వరలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో తెలిపారు.
రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని, అందువల్ల టోల్ వసూలు చేయడం తప్పనిసరిగా మారిందని ఆయన వివరించారు.
ప్రస్తుతం దేశంలో నాలుగు లైన్ల రహదారులపై మాత్రమే టోల్ పన్ను వసూలు చేస్తున్నామని,రెండు లైన్ల రహదారులపై టోల్ విధించడం లేదని గడ్కరీ స్పష్టం చేశారు.
2019-20లో రూ.27,503 కోట్ల టోల్ ఆదాయం వచ్చిందని, 2023-24 నాటికి ఇది రూ.64,809.86 కోట్లకు పెరిగిందని తెలిపారు.
వివరాలు
ఉపగ్రహ ఆధారిత టోల్ పన్ను వ్యవస్థ
అలాగే, 2023-24లో 18 ఏళ్లలోపు పిల్లల కారణంగా 11,890 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, వీటిలో అత్యధికమైనవి(2,063) తమిళనాడులో నమోదయ్యాయని ఆయన వివరించారు.
ఉపగ్రహాల సహాయంతో ప్రధాన రహదారులపై టోల్ సుంకాలను వసూలు చేసే కొత్త విధానంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది.
దీనిపై ఎపెక్స్ కమిటీ అధ్యయనం కొనసాగిస్తోందని,భద్రతా,వ్యక్తిగత గోప్యతా అంశాలపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు.
ఈ విధానం అమలులోకి వస్తే,వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిగ్గా రుసుము చెల్లించి వేగంగా ప్రయాణించగలవు.
ప్రస్తుతం భారత్ తన నావిక్ వ్యవస్థ ద్వారా పరిమిత సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించింది.
భవిష్యత్తులో అంతర్జాతీయ జీఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల సహాయంతో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.