
Royal Enfield bikes on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్స్.. ఐదు నగరాల్లో ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ ఆటో మొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన వాహనాలను ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయించనుంది. కంపెనీ ముఖ్యంగా తన 350 సీసీ శ్రేణి బైక్స్ ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులకు అందించనుంది. ఈ కొత్త సేవలు సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ప్రారంభంలో ఈ సేవలు బెంగళూరు,గురుగ్రామ్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి లాంటి ఐదు ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, మెటోర్ 350 వంటి ప్రధాన మోటార్‌సైకిళ్లు ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
బైకుల ధరల్లో సుమారు రూ.22,000 చొప్పున తగ్గింపు
బైక్స్ పై డెలివరీ మరియు విక్రయానంతర సేవలు అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికృత డీలర్ల ద్వారా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాక, సెప్టెంబర్ 22 నుండి తగ్గిన జీఎస్టీ ప్రయోజనాలతో ఈ మోటార్‌సైకిళ్లు కొనుగోలు చేయవచ్చని వివరించింది. ఇప్పటికే, కొన్న బైకుల ధరల్లో సుమారు రూ.22,000 చొప్పున తగ్గింపు కూడా అమలులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి పనిచేయడం ద్వారా, డిజిటల్ ఫస్ట్ వినియోగదారులకు చేరువ కావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐషర్ మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ బి. గోవిందరాజన్ వెల్లడించారు.
వివరాలు
దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరించేలా ప్లాన్
మొదట ఐదు నగరాల్లో సేవలు ప్రారంభమై, తర్వాత దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరించేలా ప్లాన్ చేసారట. దేశంలో మిడ్‌సైజ్ మోటార్‌సైకిల్ బ్రాండ్ పూర్తి పోర్ట్‌ఫోలియోను ఇ-కామర్స్ వేదికపై అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రయత్నం ఇదే తొలిసారి అని కంపెనీ పేర్కొంది. యువతకు, డిజిటల్ వినియోగదారులకు చేరువ కావడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అని భావిస్తున్నారు.