Ola Electric: Rs.2,000 కోట్లు సమీకరణకు సిద్దమైన ఓలా ఎలక్ట్రిక్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. తన బ్యాటరీ తయారీ విభాగం అయిన ఓలా సెల్ టెక్నాలజీస్(OCT)లో వాటాను విక్రయించి సుమారు ₹2,000కోట్ల వరకు నిధులు సమీకరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. కంపెనీ ఆర్థిక స్థితిని మరింత బలపరచడంతో పాటు దేశీయంగా బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులకు బాధ్యతలు ఈ నిధుల సమీకరణ ప్రక్రియను నిర్వహించేందుకు అవెండస్ క్యాపిటల్,మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలను ఓలా నియమించింది. ఈ వాటాల విక్రయం ద్వారా సావరిన్ వెల్త్ ఫండ్స్ సహా పలు ఆర్థిక పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశముంది. అలాగే కంపెనీ బ్యాటరీ వ్యాపారానికి మార్కెట్‌లో విలువ నిర్ధారణ కూడా జరగనుంది.
వివరాలు
తమిళనాడులో ప్లాంట్ - సామర్థ్య విస్తరణ లక్ష్యం
ఓలా సెల్ టెక్నాలజీస్ ప్రస్తుతం తమిళనాడులో లిథియం-ఐయాన్ సెల్ తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ సామర్థ్యం 1.5GWh కాగా,ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దీన్ని 6 GWh వరకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో బ్యాటరీ తయారీని స్థానికీకరించడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ఈ ప్రణాళికలో కీలక భాగం. గిగాఫ్యాక్టరీ - భారీ పెట్టుబడులు ఈ గిగాఫ్యాక్టరీని సుమారు ₹3,500కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కాకుండా వివిధ పరిశ్రమలకు అవసరమైన ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలకు కూడా మద్దతు ఇవ్వనుంది. పునరుత్పాదక శక్తి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి,వినియోగం మధ్య సమతుల్యత సాధించడంలో బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు కీలకంగా మారనున్నాయి.
వివరాలు
ఎనర్జీ స్టోరేజ్ రంగంలో విస్తరణ
ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే గృహ వినియోగానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను పరిచయం చేసింది. త్వరలో వాణిజ్య రంగంలో కూడా ఈ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రిసెర్చ్‌లో ముందంజ కంపెనీ బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా పరిశోధనలు చేపడుతోంది. ఈ కేంద్రంలో 200కు పైగా ఇంజనీర్లు, పరిశోధకులు పనిచేస్తున్నారు. NMC, LFP, LMFP, LMR వంటి పలు బ్యాటరీ టెక్నాలజీలపై దాదాపు 400 పేటెంట్లను అభివృద్ధి చేసింది. ఆర్థిక పునర్వ్యవస్థీకరణలో భాగం ఇక ఈ వాటాల విక్రయం కంపెనీ ఆపరేషన్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్యాటరీ తయారీ రంగాల్లో విస్తరణకు నిధులు సమీకరించడంతో పాటు ఆర్థికంగా బలోపేతం కావడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.