Ola Electric: యాప్, వెబ్‌సైట్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్పేర్ పార్టులు అమ్మకం
ఈ వార్తాకథనం ఏంటి
విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) విక్రయానంతర సేవల నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సంస్థ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను ఓపెన్ ప్లాట్‌ఫామ్‌గా మార్చింది. అంటే, ఓలా ఎలక్ట్రిక్ సొంతంగా అభివృద్ధి చేసిన సర్వీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీని ఇప్పుడు స్వతంత్రంగా పనిచేసే గ్యారేజీలు, ఫ్లీట్ ఆపరేటర్లు కూడా ఉపయోగించవచ్చని సంస్థ స్పష్టం చేసింది. దీంతో, స్పేర్ పార్ట్స్, డయాగ్నస్టిక్ సాధనాలు, సర్వీస్ శిక్షణా మాడ్యూల్స్ ఇకపై కేవలం ఓలా కస్టమర్లకే కాకుండా.. గ్యారేజీలు, మెకానిక్స్, ఫ్లీట్ సేవలందించే వారికి కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ వివరించింది.
వివరాలు
మధ్యవర్తుల ప్రమేయం ఉండబోదు
హైపర్ సర్వీస్‌లను మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా, ఇకపై వినియోగదారులు ఓలా ఎలక్ట్రిక్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా అధీకృతమైన, నాణ్యమైన విడిభాగాలను నేరుగా కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. ఇందులో ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం ఉండదని కూడా స్పష్టంచేసింది. అదనంగా, సంస్థ త్వరలో డయాగ్నస్టిక్ టూల్స్,టెక్నీషియన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు వంటి అంశాలను దశలవారీగా అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలో ఉందని, ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భవీశ్ అగర్వాల్ వెల్లడించారు. విక్రయానంతర సేవలపై కస్టమర్లలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు, ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త చర్యలను చేపట్టిందని సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓలా స్టోర్లను ప్రారంభించిన సంస్థ, ఇప్పుడు సేవల ప్రమాణాన్ని మరింతగా పెంచడంపైనే దృష్టి సారిస్తోంది.