TATA Motors: రూ.4,999 ఈఎంఐతో టాటా కార్ సొంతం.. డిసెంబర్‌లో స్పెషల్ ఆఫర్!
ఈ వార్తాకథనం ఏంటి
టాటా మోటార్స్ కార్ల కొనుగోలుదారులకు డిసెంబర్‌లో శుభవార్త అందించింది. తమ మొత్తం ప్యాసింజర్ వాహన శ్రేణికి కొత్తగా ఈఎంఐ చెల్లింపు పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక స్కీములు నాలుగు పెట్రోల్/డీజిల్ వాహనాలు, నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలు కలిపి మొత్తం ఎనిమిది మోడళ్లకు వర్తించనున్నాయి. పెట్రోల్, డీజిల్ విభాగంలో టాటా టియాగోకు ఈఎంఐలు నెలకు రూ.4,999 నుంచి ప్రారంభమవుతాయి. టిగోర్, పంచ్ మోడళ్లకు రూ.5,999 నుంచి, ఆల్ట్రోజ్‌కు రూ.6,777 నుంచి ఈఎంఐలు అందుబాటులో ఉంటాయి. నెక్సాన్ కోసం నెలకు రూ.7,666 నుంచి, కర్వ్‌కు రూ.9,999 నుంచి ఈఎంఐలు నిర్ణయించారు.
Details
పంచ్ ఈవీకి రూ.7,999 ఈఎంఐ
ఎలక్ట్రిక్ వాహనాల్లో టియాగో.ఈవీకి నెలకు రూ.5,999 నుంచి ఈఎంఐలు ప్రారంభమవుతాయి. పంచ్.ఈవీ రూ.7,999 ఈఎంఐతో లభించనుండగా, నెక్సాన్.ఈవీకి రూ.10,999ఈఎంఐ ఉంది. కర్వ్.ఈవీకి అత్యధికంగా నెలకు రూ.14,555 ఈఎంఐగా నిర్ణయించారు. కంపెనీ వివరాల ప్రకారం, పెట్రోల్, డీజిల్ వాహనాల ఈఎంఐలు 25 శాతం లేదా 30 శాతం బెలూన్ స్కీమ్ ఎంపికతో పాటు 84 నెలల లోన్ టర్మ్ ఆధారంగా లెక్కించబడతాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం 120 నెలల లోన్ వ్యవధిని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ ఫైనాన్సింగ్ ఆఫర్లు ఫైనాన్షియర్ ఆమోదానికి లోబడి ఉంటాయని, వాస్తవ ఈఎంఐలు లోన్ మొత్తం, వాహనం ఆన్‌రోడ్ ధరను బట్టి మారవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక ఆఫర్లు డిసెంబర్ 31, 2025 వరకు చెల్లుబాటు అవుతాయి.
Details
భద్రతపై టాటా ప్రత్యేక దృష్టి
టాటా మోటార్స్ గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ దేశీయ ఆటో కంపెనీలలో ఒకటి. ఇది దేశ ప్రయాణికుల వాహన మార్కెట్లో మూడవ అతిపెద్ద కార్ల తయారీదారుగా నిలిచింది. నాణ్యత, కస్టమర్ సంతృప్తి అంశాలకు కంపెనీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. వివిధ ఇంధన ఎంపికలు, బాడీ స్టైల్స్‌తో పాటు అధునాతన భద్రతా ఫీచర్లు, కనెక్టెడ్ టెక్నాలజీతో టాటా కార్లు అందుబాటులో ఉన్నాయి. పూణే (మహారాష్ట్ర), సనంద్ (గుజరాత్)లో కంపెనీ తయారీ యూనిట్లు ఉన్నాయి.
Details
దేశవ్యాప్తంగా టాటా నెట్‌వర్క్
టాటా మోటార్స్ డీలర్‌షిప్, అమ్మకాలు, సర్వీస్, స్పేర్ పార్ట్స్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 3,500కు పైగా టచ్‌పాయింట్లుగా విస్తరించి ఉంది. 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 195 నగరాల్లో 250కు పైగా డీలర్‌షిప్‌లు పనిచేస్తున్నాయి. ఇది భారత ఆటోమొబైల్ రంగంలో మూడవ అతిపెద్ద అమ్మకాలు, సేవల నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందింది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ టాటా మోటార్స్ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలను నిర్వహిస్తోంది. ఈ వాహనాలు కంపెనీ స్వంత జిప్‌ట్రాన్ టెక్నాలజీతో జీరో కాలుష్యం, కనెక్టెడ్ ఫీచర్లు, తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో కూడిన మొబిలిటీ పరిష్కారాలను అందిస్తున్నాయి.