Car prices increase: జనవరి-2024లో కార్ల ధరలను పెంచనున్న కంపెనీలు ఇవే
జనవరి-2024లో పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి. ధరలను పెంచే మేకర్ల జాబితాలో మారుతీ సుజుకీ, మహీంద్రా, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం కారణంగానే కంపెనీలు ధరలను పెంచాలని నిర్ణయించాయి. మారుతీ సుజుకీ ఈ ఏడాది ఏప్రిల్‌లో చివరిసారిగా వాహన ధరలను 0.8% పెంచింది. పెరుగుతున్న ఇన్‌పుట్, నిర్వహణ ఖర్చుల కారణంగా జనవరి నుంచి Audi తన వాహన ధరలను 2% వరకు పెంచాలని యోచిస్తోంది. బ్రాండ్ ప్రీమియం పొజిషనింగ్‌ను నిలబెట్టుకునేందుకు ధరల సవరణ తప్పనిసరి అని Audi ఇండియా సీఈఓ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు.
2శాతం నుంచి 3శాతం వరకు ధరలు పెరగొచ్చు
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో మహీంద్రా కంపెనీ తన SUVల ధరలను పెంచాలని భావిస్తోంది. ఈ కంపెనీ ఎంత పెంచుతుందనేది తెలియాల్సి ఉంది. హ్యుందాయ్ కూడా మహీంద్రా బాటలోనే నడుస్తోంది. ఎంజీ మోటార్ ద్రవ్యోల్బణం, పెరిగిన వస్తువుల ధరల కారణంగా జనవరి 2024 నుంచి తమ మోడళ్ల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. BMW, Volkswagen, SKODA, Mercedes-Benz, Volvo, Nissan, Honda సహా అనేక ఇతర వాహన తయారీదారులు జనవరి 2024 నుండి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ధరల పెరుగుదల ఎక్కువగా 2శాతం నుంచి 3శాతం వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని హై-టెక్ ఫీచర్‌లు కలిగిన మోడల్స్ ధరల్లో పెంపు భారీగా ఉండే అవకాశం ఉంది.