Rapido cab : బైక్ క్యాబ్ సర్వీస్ ర్యాపిడో నుంచి క్యాబ్ సేవలు.. ఉబర్, ఓలాలకు సవాల్
ప్రముఖ క్యాబ్ సర్వీస్ ర్యాపిడో నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు కారు క్యాబ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ సంస్థలు ఉబర్,ఓలాలకు పోటీగా ర్యాపిడో క్యాబ్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీసులను దిల్లీ,హైదరాబాద్, బెంగళూరుల్లో అందుబాటులో ఉంచింది.త్వరలోనే దేశ వ్యాప్తంగా మిగతా ప్రధాన నగరాలకు విస్తరిస్తామని ర్యాపిడో వెల్లడించింది. లక్ష క్యాబ్'లు : ప్రస్తుతం దిల్లీ, హైదరాబాద్, బెంగళూరుల్లో తమ ప్లాట్ ఫామ్'లపై లక్ష క్యాబ్ సేవలు అందుబాటులో ఉండటం గమనార్హం.ఈ మేరకు ర్యాపిడో కో ఫౌండర్ పవన్ గుంటుపల్లి వెల్లడించారు. బైక్ టాక్సీ విభాగంలో ర్యాపిడో మార్కెట్ లీడర్'గా కొనసాగుతోంది.అయితే బైక్ టాక్సీ సెగ్మెంట్లో ర్యాపిడో కంపెనీ వాటా 60 శాతానికిపైగానే ఉండటం గమనార్హం.
డ్రైవర్'కు ఎక్కువ మొత్తం నిధులు మిగిలిపోతాయి : పవన్ గుంటుపల్లి
క్యాబ్ సర్వీసులో డ్రైవర్ల నుంచి మిగతా అగ్రిగేటర్లు ఉపయోగించే కమిషన్ విధానం ద్వారా కాకుండా, తక్కువ మొత్తంలోనే సాఫ్ట్ వేర్ వినియోగ చార్జీని వసూలు చేస్తామని పవన్ గుంటుపల్లి వివరించారు. ఫలితంగా డ్రైవర్'కు ఎక్కువ మొత్తం నిధులు మిగిలిపోతాయని ఆయన తెలిపారు.డ్రైవర్ల నుంచి వసూలు చేసే సబ్ స్క్రిప్షన్ ఫీజు నామమాత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. కస్టమర్లకు కూడా 'లోయెస్ట్ ప్రైస్ గ్యారెంటీ'ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 130 మిలియన్ డాలర్లు : 2022లో వివిధ సోర్సుల నుంచి ర్యాపిడో 130 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ర్యాపిడో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 2.5కోట్ల మంది కస్టమర్లు, 15 లక్షల మంది భాగస్వామ్య డ్రైవర్లు సంస్థలో ఉన్నారు.