Royal Enfield Bullet 650: భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లాంచ్.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 650 సీసీ బైక్‌ల శ్రేణిని మరింత విస్తరించింది. కొత్తగా బుల్లెట్ 650ను విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.65 లక్షలుగా నిర్ణయించింది. ఈ మోటార్‌సైకిల్‌ను తొలిసారిగా EICMA 2025లో ప్రదర్శించగా.. ఇప్పుడు కంపెనీ లైనప్‌లో ఇప్పటికే ఉన్న కాంటినెంటల్ GT 650, ఇంటర్‌సెప్టర్ 650, బేర్ 650, సూపర్ మీటియర్ 650 వంటి మోడళ్ల సరసన చేరింది. ముఖ్యంగా 1932 నుంచి ఉత్పత్తిలో ఉన్న బుల్లెట్ బ్రాండ్‌కు భారత మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఈ కొత్త మోడల్‌పై ఆసక్తి నెలకొంది.
వివరాలు
స్టైలింగ్ లుక్‌తో సరికొత్త మోడల్..
డిజైన్ పరంగా చూస్తే బుల్లెట్ 650లో బుల్లెట్ 350, క్లాసిక్ 650 ట్విన్ మోడళ్లకు దగ్గరగా ఉండే స్టైలింగ్ కనిపిస్తుంది. ఇందులో సిగ్నేచర్ క్రోమ్ హెడ్‌లైట్, హుడ్, టెయిల్‌లైట్ డిజైన్‌ను అందించారు. ఫ్యూయల్ ట్యాంక్‌పై ఐకానిక్ హ్యాండ్ పెయింటెడ్ పిన్‌స్ట్రైప్స్‌తో పాటు మెటాలిక్ బ్యాడ్జ్‌ను కూడా అమర్చారు. అలాగే క్లాసిక్ 650తో పోలిస్తే ఫెండర్లు కొంచెం స్క్వేర్ డిజైన్‌లో కనిపిస్తున్నాయి. ఇక ఈ బైక్‌లో ప్రధాన మార్పుల విషయానికి వస్తే.. రైడింగ్ ఎర్గోనామిక్స్‌ను మరింత ప్రాక్టికల్‌గా రూపొందించారు. క్లాసిక్ 650లో ఉన్న సెటప్‌కు భిన్నంగా ఇందులో సింగిల్ పీస్ ఫిక్స్‌డ్ సీటును ఇచ్చారు. ఇది రియర్ సస్పెన్షన్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతో పిలియన్ రైడర్‌కు మరింత కంఫర్ట్ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వివరాలు
అద్భుతమైన ఫీచర్లు..
మరోవైపు డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్ కోసం ఇచ్చిన చిన్న డిజిటల్ డిస్‌ప్లే మాత్రం క్లాసిక్ 650లో ఉన్నట్టే ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ప్రసిద్ధ 647.95 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను ఈ బుల్లెట్ 650లో ఉపయోగించారు. ఇదే ఇంజిన్ ఇప్పటికే ఇంటర్‌సెప్టర్ 650, సూపర్ మీటియర్ 650 సహా మరో ఆరు మోడళ్లలో కూడా అందుబాటులో ఉంది. ఎయిర్-ఆయిల్ కూల్డ్ టెక్నాలజీతో వచ్చే ఈ ఇంజిన్ 7,250 rpm వద్ద 47 bhp పవర్, 5,650 rpm వద్ద 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీంతో ఇప్పటివరకు వచ్చిన బుల్లెట్ మోడళ్లలో ఇదే అత్యంత పవర్‌ఫుల్ వెర్షన్‌గా నిలిచింది.
వివరాలు
లాంగ్ డిస్టెన్స్ టూరింగ్‌కు అనుకూలంగా బైక్..
బుల్లెట్ 650లో స్టీల్ ట్యూబింగ్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ముందుభాగంలో 43 mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. బుల్లెట్‌కు ఉన్న ఐకానిక్ లుక్‌ను కొనసాగిస్తూ ముందుభాగంలో 19 ఇంచుల వీల్, వెనుక భాగంలో 18 ఇంచుల వీల్ కాంబినేషన్‌ను ఇచ్చారు. బ్రేకింగ్ వ్యవస్థ విషయానికి వస్తే ముందుభాగంలో 320 mm డిస్క్, వెనుక భాగంలో 300 mm డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. వీటికి స్టాండర్డ్ డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ అందించారు. బైక్ సీటు ఎత్తు 800 mmగా ఉండగా.. కర్బ్ వెయిట్ 243 కిలోలుగా ఉంది. 14.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను అందించారు. దీంతో లాంగ్ డిస్టెన్స్ టూరింగ్‌కు ఈ బైక్ మరింత అనుకూలంగా మారనుంది.