Tata Motors: లాంచ్‌కు ముందే సంచలనం.. మైలేజీ టెస్ట్‌లో అదరగొట్టిన టాటా హారియర్, సఫారి పెట్రోల్ వెర్షన్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో అధికారిక లాంచ్‌కు ముందే టాటా మోటార్స్ హారియర్, సఫారి ఎస్‌యూవీల కొత్త పెట్రోల్ వెర్షన్లను ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లలో కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. దీనికి 'హైపీరియన్' అనే పేరును పెట్టింది. ఇదే ఇంజిన్‌ను ఇటీవల ఆల్-న్యూ సియెర్రా మోడల్‌తో టాటా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో ఉన్న నాట్రాక్స్ (NATRAX) టెస్ట్ ట్రాక్‌లో హారియర్, సఫారి ఎస్‌యూవీలను పరీక్షించిన వీడియోను టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ పరీక్షలు నియంత్రిత పరిస్థితుల్లో నిర్వహించినవేనని, ఇవి వాస్తవ రోడ్ పరిస్థితుల్లో వాహనాల పనితీరును పూర్తిగా ప్రతిబింబించవని కంపెనీ స్పష్టం చేసింది.
Details
గరిష్ఠంగా గంటకు 216 కిలోమీటర్ల వేగం
వీడియోలో 'హైపీరియన్' బ్యాడ్జింగ్ ఉన్న ఎరుపు రంగు హారియర్ ముందుగా కాలిబ్రేషన్ అనంతరం ట్రాక్‌పైకి వెళ్లగా, దాని వెనక అదే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌ను కూడా పరీక్షించారు. టాటా మోటార్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పరీక్షల్లో సఫారి గరిష్ఠంగా గంటకు 216 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. ఇంధన సామర్థ్యం విషయంలోనూ రెండు ఎస్‌యూవీలు మంచి ఫలితాలు సాధించాయి. హారియర్ లీటర్‌కు 25.9 కిలోమీటర్ల మైలేజ్‌ను నమోదు చేయగా, సఫారి లీటర్‌కు 25 కిలోమీటర్ల మైలేజ్‌ను సాధించింది. హారియర్ సాధించిన ఈ మైలేజ్‌ను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది.
Details
ఎస్‌యూవీ విభాగంలో ఇది రికార్డు మైలేజ్
భారత్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగిన పెట్రోల్ ఎస్‌యూవీ విభాగంలో ఇది రికార్డు మైలేజ్‌గా నిలిచింది. హారియర్, సఫారి రెండింటికీ శక్తినిచ్చేది 1.5 లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 170 హెచ్‌పీ పవర్‌తో పాటు 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. ఈ మోడళ్ల అధికారిక లాంచ్ తేదీతో పాటు ధరల వివరాలను వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదే హైపీరియన్ ఇంజిన్‌ను అమర్చిన సియెర్రా మోడల్‌ను కూడా నాట్రాక్స్‌లో టాటా మోటార్స్ పరీక్షించింది.
Details
గరిష్ఠంగా గంటకు 222 కిలోమీటర్ల వేగం
ఈ మోడల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 12 గంటల ఎండ్యూరెన్స్ రన్‌లో సియెర్రా లీటర్‌కు 29.9 కిలోమీటర్ల మైలేజ్‌ను సాధించింది. మరో పరీక్షలో ఇది గరిష్ఠంగా గంటకు 222 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. అయితే ఇవన్నీ పూర్తిగా నియంత్రిత పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షల ఫలితాలేనని, వాస్తవ వినియోగంలో పనితీరు, మైలేజ్ భిన్నంగా ఉండొచ్చని టాటా మోటార్స్ స్పష్టం చేసింది.