LOADING...
Suzuki e-Access: దేశీయ మార్కెట్‌లో సుజుకీ తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 'ఇ-యాక్సెస్‌' లాంచ్
దేశీయ మార్కెట్‌లో సుజుకీ తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 'ఇ-యాక్సెస్‌' లాంచ్

Suzuki e-Access: దేశీయ మార్కెట్‌లో సుజుకీ తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 'ఇ-యాక్సెస్‌' లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా దేశీయ మార్కెట్‌లో తన తొలి విద్యుత్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. కంపెనీకి అత్యంత విజయవంతమైన మోడల్‌గా పేరుగాంచిన యాక్సెస్‌ను ఎలక్ట్రిక్‌ అవతార్‌లో 'ఇ-యాక్సెస్‌' పేరుతో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సుజుకీ తన గురుగ్రామ్‌ ప్లాంట్‌లో తయారు చేయనుంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగంలో బజాజ్‌ చేతక్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌, ఏథర్‌ రిజ్తా మోడళ్లకు ఇది ప్రత్యక్ష పోటీగా నిలవనుంది. సుజుకీ ఇ-యాక్సెస్‌లో 3.07 kWhసామర్థ్యంతో కూడిన లిథియం ఐరన్‌ పాస్ఫేట్‌ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ సింగిల్‌ ఛార్జ్‌తో 95 కిలోమీటర్ల వరకు రేంజ్‌ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 4.1 kWఎలక్ట్రిక్‌ మోటార్‌ను అందించారు. ఇది గరిష్టంగా 15 Nmపీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Details

గరిష్ట వేగం గంటకు 71 కిలోమీటర్లు

ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 71 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. ఛార్జింగ్‌ విషయానికి వస్తే, పోర్టబుల్‌ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్‌ చేయడానికి 4 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని సుజుకీ తెలిపింది. ఫాస్ట్‌ ఛార్జర్‌తో పూర్తి బ్యాటరీని ఛార్జ్‌ చేయడానికి 2 గంటల 12 నిమిషాలు మాత్రమే పడుతుందని వెల్లడించింది. ఫీచర్ల పరంగా సుజుకీ ఇ-యాక్సెస్‌లో పూర్తి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ కన్సోల్‌ను అందించారు. ఇందులో ఎకో, రైడ్‌-ఏ, రైడ్‌-బి అనే మూడు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. రీజనరేటివ్‌ బ్రేకింగ్‌, రివర్స్‌ మోడ్‌ వంటి ఆధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి. బ్లూటూత్‌ మరియు యాప్‌ కనెక్టివిటీతో పాటు యూఎస్‌బీ ఛార్జింగ్‌ సదుపాయాన్ని కల్పించారు.

Details

నాలుగు రంగుల్లో లభ్యం

ఎల్‌ఈడీ లైట్స్‌ను అందించగా, ఈ స్కూటర్‌ మొత్తం నాలుగు రంగుల ఆప్షన్లలో లభిస్తోంది. గతేడాది భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ స్కూటర్‌ను సుజుకీ తొలిసారిగా ప్రదర్శించింది. ప్రస్తుతం సుజుకీ డీలర్‌షిప్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కూడా ఇ-యాక్సెస్‌ను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. ఏడేళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల వరకు వారెంటీని అందిస్తోంది. సుజుకీ ఇప్పటికే ఉన్న కస్టమర్లకు రూ.10 వేల వరకు లాయల్టీ బోనస్‌, ఇతర వినియోగదారులకు రూ.7 వేల వెల్‌కం బోనస్‌ను ప్రకటించింది. అలాగే 5.99 శాతం వడ్డీ రేటుతో ఫైనాన్సింగ్‌ ఆప్షన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement