LOADING...
Tata Sierra: భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త సియెరా ఎస్‌యూవీలు
భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త సియెరా ఎస్‌యూవీలు

Tata Sierra: భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త సియెరా ఎస్‌యూవీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక వరల్డ్ కప్ గెలుపును గుర్తుగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ విభాగం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న జట్టులోని ప్రతి ఒక్కరికి, త్వరలో మార్కెట్లోకి వస్తున్న కొత్త టాటా సియెరా (Tata Sierra) ఎస్‌యూవీను ప్రత్యేక బహుమతిగా అందజేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ బహుమతి కేవలం గుర్తుగా ఇచ్చేదే కాదు, దేశానికి కీర్తి తెచ్చిన వారి ధైర్యసాహసాలకు, కృషికి, అంకితభావానికి టాటా మోటార్స్ అందిస్తున్న సత్కారం అని పేర్కొంది. నవంబర్ 2న జరిగిన మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్,దక్షిణాఫ్రికా జట్టును 52 పరుగుల తేడాతో ఓడించింది. మహిళల కోసం ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.

వివరాలు 

ఈ విజయం ప్రతి భారతీయుడికి ప్రేరణ

ఈ చారిత్రక సందర్భంపై మాట్లాడుతూ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్‌ MD & CEO శైలేష్ చంద్ర మాట్లాడుతూ . . ''భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శించిన అత్యుత్తమ ఆట ప్రతిభ దేశవ్యాప్తంగా గర్వభావం నింపింది. వారి విజయగాథ పట్టుదల, నమ్మకం, లక్ష్య సాధనకు ప్రతీక. ఈ విజయం ప్రతి భారతీయుడికి ప్రేరణ. ఇలాంటి లెజెండరీ ఆటగాళ్లకు, మరో లెజెండ్‌గా తిరిగి వస్తున్న టాటా సియెరా ఎస్‌యూవీని అందించడం మా పక్షాన గౌరవంగా భావిస్తున్నాం. ఇది రెండు మహత్తరమైన స్ఫూర్తి చిహ్నాల కలయిక'' అని తెలిపారు. భారత జట్టులోని ప్రతి సభ్యురాలికి,సియెరా ప్రత్యేక ఎడిషన్‌లోని టాప్ వేరియంట్‌ను బహుమతిగా అందించనున్నట్లు కంపెనీ స్పష్టంచేసింది.

వివరాలు 

 మార్కెట్లోకి నవంబర్ 25న టాటా సియెరా 

నవంబర్ 25న టాటా సియెరా అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ ఎస్‌యూవీ ముఖ్యమైన ఫీచర్లలో లెవెల్-2 ADAS (అడ్‌వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, అధునాతన కనెక్టివిటీ టెక్నాలజీ ఉంటాయని సమాచారం. ఇంజిన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 2.0-లీటర్ టర్బో డీజిల్ వేరియంట్‌లు ఉండే అవకాశం ఉంది. ఇవి రెండూ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వచ్చే అవకాశం ఉంది. ధరల వివరాలు అధికారికంగా తెలియజేయకపోయినా, టాటా సియెరా ధర సుమారు రూ.13.50 లక్షల నుండి రూ.24 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టాటా మోటార్స్ చేసిన ట్వీట్