
Telangana: వాహనదారులకు 'సారథి' పోర్టల్ ద్వారా స్మార్ట్ కార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
వాహనదారులకు అందించే లైసెన్స్,రిజిస్ట్రేషన్ స్మార్ట్ కార్డులు ఇకపై కనుమరుగు కానున్నాయి. రవాణాశాఖ తీసుకున్న తాజా సంస్కరణల్లో భాగంగా, 'సారథి' పోర్టల్ ద్వారా ఈ స్మార్ట్ కార్డులు ఆన్‌లైన్‌లో పొందగల విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి. వాహనదారులు శాశ్వత లైసెన్స్ లేదా లైసెన్స్ రెన్యూవల్ కోసం ముందుగా ఆన్‌లైన్‌లో తగిన రుసుము చెల్లించి,ముందస్తు స్లాట్ బుకింగ్ చేయాలి. ఆ తరువాత అవసరమైన పత్రాలను జత చేసి,కార్యాలయంలో సమర్పించాలి. అక్కడ ఫొటో తీసుకోవడం, సంతకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంవీఐ స్థాయి అధికారి ద్వారా ధృవీకరణ పొందిన తరువాత,స్మార్ట్ కార్డు నేరుగా వాహనదారుడి మొబైల్ లేదా ఇమెయిల్‌కి లింక్ రూపంలో పంపబడుతుంది. ఆ లింక్ ద్వారా వాహనదారు తన లైసెన్స్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వివరాలు
త్వరలో 'వాహన్' పోర్టల్
ఇప్పటివరకు, తపాలాశాఖ స్పీడ్‌పోస్ట్ సర్వీసు ద్వారా వాహనదారుల ఇంటికి కార్డులు పంపే పద్ధతి ఉంది. అయితే, మునుపటి వ్యవస్థలో ముద్రణలో, స్టేషనరీ కొరతలతో, జారీలో ఆలస్యమవ్వడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నూతన పద్ధతితో అరచేతిలో లైసెన్సు కార్డును అవసరమైన చోట చూపించుకునే అవకాశాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుతంలో లైసెన్స్ కార్డుల ముద్రణ నిలిపివేశారు. త్వరలో 'వాహన్' పోర్టల్ ప్రారంభమైతే , రిజిస్ట్రేషన్ కార్డుల ముద్రణ సైతం నిలిచిపోనున్నాయి.