Loading...
Telangana: వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలకు ఇక చెల్లుచీటి.. తెలంగాణలో 15 ఏటీఎస్‌లు
వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలకు ఇక చెల్లుచీటి.. తెలంగాణలో 15 ఏటీఎస్‌లు

Telangana: వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలకు ఇక చెల్లుచీటి.. తెలంగాణలో 15 ఏటీఎస్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

వాహనాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) జారీ చేసే ప్రస్తుత విధానానికి త్వరలో ముగింపు పలికే అవకాశం ఉంది. తెలంగాణవ్యాప్తంగా 15ప్రాంతాల్లో ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లు(ఏటీఎస్‌)ఏర్పాటు చేసి.. అక్కడే వాహనాల ఫిట్‌నెస్‌ను పరీక్షించి ఎఫ్‌సీలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినట్లు రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇకపై సరకు రవాణా,ప్రజా రవాణాకు వినియోగించే భారీ,మధ్యతరహా వాహనాలు,అంటే లారీలు, బస్సులతో పాటు లైట్‌ మోటారు వాహనాలైన కార్లు,జీపుల ఫిట్‌నెస్‌ పరీక్షలు కూడా ఏటీఎస్‌లలోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ) పర్యవేక్షణలో మాన్యువల్‌గా జరుగుతున్న ఈ ప్రక్రియ స్థానంలో శాస్త్రీయ,సాంకేతిక విధానం అందుబాటులోకి రానుంది.

వివరాలు 

ఎఫ్‌సీల జారీ ప్రక్రియలో దళారుల ప్రమేయంతో అవినీతి

ఇప్పటివరకు అధికారులు వాహనాలను పైపైన పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఈ విధానంలో లోపాల కారణంగా ఫిట్‌నెస్‌ సరిగా లేని కొన్ని వాహనాలు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

అంతేకాకుండా ఎఫ్‌సీల జారీ ప్రక్రియలో దళారుల ప్రమేయంతో అవినీతి జరుగుతున్నట్లు కూడా గుర్తించారు.

ఈ నేపథ్యంలో మానవ జోక్యాన్ని తగ్గించి పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఏటీఎస్‌లను తీసుకొస్తోంది.

వివరాలు 

రెండు క్లస్టర్లుగా విభజన..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఇందులో భాగంగా తొలిదశలో 15 ఏటీఎస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

వీటిని డీటీసీ (డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌), ఆర్టీవో కార్యాలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రెండు క్లస్టర్లుగా ప్రాంతాలను విభజించారు.

ADVERTISEMENT

వివరాలు 

క్లస్టర్‌-1.. రూ.61.60 కోట్ల వ్యయం

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హనుమకొండ, సంగారెడ్డి జిల్లాల్లోని డీటీసీ కార్యాలయాల పరిధిలో ఏటీఎస్‌లను ఏర్పాటు చేయనున్నారు.

అలాగే మేడ్చల్, దుండిగల్‌-1, దుండిగల్‌-2లోని ఆర్టీవో కార్యాలయాల ప్రాంతాల్లోనూ వీటిని నిర్మిస్తారు. ఈ క్లస్టర్‌ ఏర్పాటుకు మొత్తం రూ.61.60 కోట్ల వ్యయం కానుంది.

క్లస్టర్‌-2.. రూ.53.68 కోట్ల వ్యయం

ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని డీటీసీ కార్యాలయ ప్రాంగణాల్లో ఏటీఎస్‌లను ఏర్పాటు చేయనున్నారు.

ఇబ్రహీంపట్నంలోని ఆర్టీవో కార్యాలయ ప్రాంతంలో ఒకటి, కొండాపూర్‌లోని డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ వద్ద మరొకటి, నాగోల్‌లోని డ్రైవింగ్‌ ట్రాక్‌ వద్ద ఇంకొకటి, పటాన్‌చెరులోని యూనిట్‌ ఆఫీస్‌ ప్రాంతంలో మరో ఏటీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ క్లస్టర్‌కు రూ.53.68 కోట్ల వ్యయం అంచనా వేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏటీఎస్‌లో ఫిట్‌నెస్‌ పరీక్షలు ఎలా జరుగుతాయి?

ఏటీఎస్‌లలో వాహనాల బ్రేకుల పనితీరు, ఇంజిన్‌ సామర్థ్యం, కాలుష్య ఉద్గారాలు తదితర కీలక అంశాలను ప్రత్యేక సెన్సర్ల సాయంతో ఆటోమేటిక్‌గా పరీక్షిస్తారు.

దీంతో వాహనం ఫిట్‌గా ఉందా లేదా అనే విషయాన్ని సాంకేతికంగా నిర్ధారించే అవకాశం ఉంటుంది.

ఏటీఎస్‌లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను నేరుగా కేంద్ర రవాణా శాఖ పరిధిలోని 'వాహన్‌' పోర్టల్‌లోకి అప్‌లోడ్‌ చేస్తారు.

దీంతో పరీక్షల ఫలితాల్లో మార్పులు చేయడం లేదా మానవ జోక్యంతో అనుకూలంగా మార్చడం వంటి అవకాశాలు తగ్గుతాయి.

వివరాలు 

ఏటీఎస్‌లో ఫిట్‌నెస్‌ పరీక్షలు ఎలా జరుగుతాయి?

మానవ ప్రమేయం తగ్గడంతో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారనుంది.

దళారుల ప్రమేయం, అవినీతిని నియంత్రించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఫిట్‌నెస్‌ పరీక్షలో అర్హత సాధించిన వాహనాలకే ఎఫ్‌సీలు జారీ అవుతాయి.

ఫలితంగా రోడ్లపై ఫిట్‌నెస్‌ లేని వాహనాల రాకపోకలు తగ్గి.. ప్రమాదాలను నియంత్రించడంతో పాటు రోడ్డు భద్రతను మెరుగుపరిచే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT