
Model Y: ఫ్యాక్టరీ నుంచి ఓనర్ ఇంటికి స్వయంగా వెళ్లిన టెస్లా కారు..వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆటోమేటిక్ వాహనాల రంగంలో టెస్లా ఒక కీలక మైలురాయిని దాటింది. టెస్లాకు చెందిన మోడల్ వై (Model Y) కారు మొట్టమొదటిసారిగా ఎలాంటి మానవ జోక్యం లేకుండా ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ ఇంటికి ప్రయాణించి డెలివరీ పూర్తిచేసింది. ఈ ఘట్టం టెక్సాస్‌లోని ఆస్టిన్ గిగాఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. సుమారు 30 నిమిషాల దూరం ప్రయాణించిన ఈ కారు నగర వీధులు, హైవేలు, ట్రాఫిక్ సిగ్నల్స్ సహా అన్ని ఆటంకాలను స్వయంగా ఎదుర్కొని కస్టమర్ ఇంటి వద్ద పార్క్ అయ్యింది.
Details
వైరల్ వీడియోతో చరిత్రలోకెక్కడిన టెస్లా
టెస్లా సంస్థ విడుదల చేసిన వీడియోలో డ్రైవర్ సీటులో ఎవరూ లేని మోడల్ వై కారు గిగాఫ్యాక్టరీ గ్యారేజ్ నుంచి బయలుదేరి సాఫీగా రోడ్లపై ప్రయాణించిన దృశ్యాలున్నాయి. వెనుక సీటు నుంచి చిత్రీకరించిన ఈ వీడియోలో, కారు మలుపులు తిప్పడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, స్టాప్ సైన్ల వద్ద ఆగడం వంటి వ్యవహారాలు ఎటువంటి మానవ నియంత్రణ లేకుండానే జరిగాయి. చివరికి కస్టమర్ నివాసానికి చేరుకున్న కారు అక్కడే పార్క్ కావడం గమనార్హం.
Details
ఎలాన్ మస్క్ ట్వీట్‌తో వెల్లడి
ఈ చారిత్రక ఘట్టాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించారు. టెస్లా మోడల్ వై కారు ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ ఇంటికి పూర్తిగా స్వయంప్రతిపత్తంగా, ఒక రోజు ముందే డెలివరీ పూర్తిచేసిందని ట్వీట్ చేశారు. తదుపరి పోస్ట్‌లో కారులో ఎవరూ లేరు. ఎలాంటి రిమోట్ నియంత్రణ లేదు. పూర్తిగా ఆటోనమస్ డ్రైవ్ ఇది అని స్పష్టం చేశారు. ఇది ప్రపంచంలో పబ్లిక్ హైవేపై జరిగిన మొట్టమొదటి పూర్తి స్వయంప్రతిపత్త డ్రైవ్‌గా మస్క్ ప్రకటించారు.
Details
ఏఐ ఆధారంగా రాబోయే రోబోటాక్సీల దిశగా టెస్లా
టెస్లా ఆటోపైలట్, ఏఐ విభాగం అధిపతి అశోక్ ఎల్లూస్వామి తెలిపిన మేరకు, ఈ ప్రయాణంలో టెస్లా మోడల్ వై కారు గంటకు 115 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని సాధించింది. ఈనెల ప్రారంభంలో ఎలాన్ మస్క్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో రోబోటాక్సీ సేవల గురించి సంకేతాలిచ్చారు. గత జూన్ 22న టెస్లా ఆస్టిన్ లో రోబోటాక్సీ సేవల మొదటి ప్రయోగాలను ప్రారంభించింది. ప్రముఖులు, పెట్టుబడిదారులు స్వయంచాలక కార్లలో ప్రయాణించడానికి అవకాశం లభించింది.
Details
ఏప్రిల్‌లోనే ప్రారంభంగా ముందుజాగ్రత్తలు
ఇటీవల జరిగిన ఈ ఘట్టానికి ముందు, టెస్లా సంస్థ ఏప్రిల్‌లో టెక్సాస్ ఫ్యాక్టరీ నుంచి పార్కింగ్ స్థలాలకు కార్లు స్వయంగా వెళ్లే విధానాన్ని ప్రదర్శిస్తూ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయి రోబోటాక్సీ డెలివరీని విజయవంతంగా పూర్తి చేసి టెస్లా ఆటోనమస్ టెక్నాలజీలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.