LOADING...
TG Transport Department: వాహనదారులకు షాక్ ఇచ్చిన రవాణాశాఖ.. వాహనాల కొనుగోలులో సర్వీస్‌ ఛార్జీల పెంపు
వాహనదారులకు షాక్ ఇచ్చిన రవాణాశాఖ.. వాహనాల కొనుగోలులో సర్వీస్‌ ఛార్జీల పెంపు

TG Transport Department: వాహనదారులకు షాక్ ఇచ్చిన రవాణాశాఖ.. వాహనాల కొనుగోలులో సర్వీస్‌ ఛార్జీల పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

వాహనదారులకు అందించే పలు రకాల సేవలపై రవాణాశాఖ సర్వీస్ ఛార్జీలను పెంచింది. ఈ పెంపు ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సోమవారం నుండి కొత్త రుసుములు అమలులోకి వచ్చాయి. ఇప్పటివరకు ద్విచక్ర వాహనాల కొనుగోలుపై విధించే సర్వీసు ఛార్జీ స్థిరంగా రూ.200గా ఉండేది. తాజాగా రవాణాశాఖ ఇచ్చిన మార్గదర్శకాలు ప్రకారం, ఇకపై బండి ధరపై 0.5 శాతం సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒక బైక్ విలువ రూ.1 లక్ష అయితే దానిపై ఇప్పుడు రూ.500 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తారు. అదే విధంగా, రూ.10 లక్షల విలువ గల బైక్‌కి రూ.5 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కార్ల విషయంలో,ఇప్పటి వరకూ రూ.400 స్థిర సర్వీస్ ఛార్జీగా ఉండేది.

వివరాలు 

వాహనాల రోడ్ ట్యాక్స్ లేదా త్రైమాసిక పన్నుల్లో ఎలాంటి మార్పులు లేవు 

ఇకపై కార్ల విలువ ఆధారంగా 0.1 శాతం మేర సర్వీస్ ఛార్జీగా వసూలు చేయనున్నారు. వాహనాల ఫిట్‌నెస్ పరీక్షకు కూడా రుసుము పెరిగింది. ఇప్పటి వరకూ ఈ పరీక్షకు రూ.700 వసూలు చేస్తుండగా, తాజా పెంపుతో అది రూ.800కి పెరిగింది. లెర్నర్ లైసెన్స్,డ్రైవింగ్ టెస్ట్‌లపై కూడా ఛార్జీలు పెరిగాయి. ఈ రెండు సేవలపై రూ.100 చొప్పున సర్వీస్ ఛార్జీలు పెంచారు. రుణంపై కొనుగోలు చేసిన వాహనాల విషయంలో,వాయిదాలన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాత ఆ వాహనంపై ఉన్న హైపోథికేషన్‌ను తొలగించాలంటే చెల్లించే ఛార్జీ ఇప్పటి వరకూ రూ.650గా ఉండేది. ఇప్పుడు ఇది మూడింతలు పెరిగి రూ.1900కి చేరుకుంది. అయితే, వాహనాల రోడ్ ట్యాక్స్ లేదా త్రైమాసిక పన్నుల్లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు.