Jaguar F-Pace: పదేళ్ల ప్రయాణానికి ముగింపు.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఉత్పత్తికి అధికారికంగా గుడ్‌బై
ఈ వార్తాకథనం ఏంటి
జాగ్వార్ తన ఆటో మొబైల్ లైనప్‌లో కీలకమైన మార్పుకు తెరలేపింది. కంపెనీ అధికారికంగా Jaguar F-Pace మోడల్ ఉత్పత్తిని ముగించింది. యూకేలోని సోలిహల్ ప్లాంట్‌లో చివరి యూనిట్ అసెంబ్లీ లైన్ నుంచి బయటకు వచ్చింది. ఈ చివరి F-Pace కారును ఇప్పటికే జాగ్వార్‌కు చెందిన పలు ఐకానిక్ మోడళ్లను భద్రపరిచిన Jaguar Daimler Heritage Trustకు అప్పగించనున్నారు.
Details
దశాబ్దకాలం లగ్జరీ SUVగా గుర్తింపు
జాగ్వార్ బ్రాండ్ నుంచి వచ్చిన తొలి SUVగా Jaguar F-Pace 2015లో డెట్రాయిట్ ఆటో షోలో గ్లోబల్‌గా ఆవిష్కృతమైంది. 2016లో అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించిన ఈ మోడల్, అదే ఏడాది అక్టోబర్ నాటికి భారత్‌లో లాంచ్ అయింది. ప్రారంభంలో ఇది రెండు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి రాగా, 2018లో పెట్రోల్ వేరియంట్‌ను జోడించారు. 2021లో F-Paceకు తొలి ఫేస్‌లిఫ్ట్ వచ్చి, కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు ఆధునిక ఫీచర్లు, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. లగ్జరీ SUV విభాగంలో దశాబ్దకాలం పాటు F-Pace జాగ్వార్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
Details
చివరి వెర్షన్ & ఎలక్ట్రిక్ దిశగా జాగ్వార్
చివరి దశలో Jaguar F-Pace రెండు ఇంజిన్ ఎంపికలతో విక్రయించబడింది. 247 హెచ్‌పీ శక్తి గల 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 204 హెచ్‌పీ శక్తి గల 2 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఈ రెండు ఇంజిన్‌లకు 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జతచేశారు. పవర్‌ను నాలుగు చక్రాలకు పంపే ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఇందులో ఉంది. F-Pace ఉత్పత్తి నిలిపివేతతో పాటు, జాగ్వార్ ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వాహనాల తయారీకి కూడా ముగింపు పలికినట్లయింది. ఇది మాజీ సీఈవో థియెరీ బొలొర్ రూపొందించిన ప్రణాళికలో భాగంగా, జాగ్వార్‌ను పూర్తిగా ఆల్-ఎలక్ట్రిక్ బ్రాండ్‌గా మార్చే దిశగా తీసుకున్న కీలక నిర్ణయం.
Details
జాగ్వార్ కొత్త బ్రాండ్ ఐడెంటిటీ
2024 నవంబర్‌లో జాగ్వార్ తన కొత్త బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. దీనిలో కొత్త లోగో, కొత్త ఇన్సిగ్నియాలు ఉన్నాయి. అనంతరం 2024 డిసెంబర్‌లో Type 00 Conceptను విడుదల చేసి, రాబోయే మోడళ్ల డిజైన్ భాషను ముందుగానే చూపించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించే నాలుగు డోర్ల ఎలక్ట్రిక్ GT మోడల్‌ను తొలుత 2025 చివర్లోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే 2025 ఆగస్టులో జరిగిన భారీ సైబర్ దాడి కారణంగా సోలిహల్, హాలివుడ్, వుల్వరాంప్టన్ ప్లాంట్లలో గ్లోబల్ ప్రొడక్షన్ నిలిచిపోయింది. దీంతో ఆ ఎలక్ట్రిక్ GT మోడల్ విడుదలను 2026కి వాయిదా వేశారు.