Toyota: AI, రోబోట్లతో టయోటా కొత్త అడుగులు.. 4 లక్షల రోబోలు అవసరం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ భవిష్యత్ తయారీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్, రోబోటిక్స్ వినియోగాన్ని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. 2028 నుంచి తమ ఫ్యాక్టరీలను ఆధునికీకరించేందుకు ఏటా 1 ట్రిలియన్ యెన్ (సుమారు 6.4 బిలియన్ డాలర్లు) వరకు ఖర్చు కావచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. కార్ల తయారీ రంగంలో ఇప్పటికే పలు సంస్థలు ఖర్చులను తగ్గించడంతో పాటు పాతబడుతున్న మౌలిక వసతులు, కార్మికుల కొరతను ఎదుర్కొనేందుకు రోబోటిక్స్ వైపు అడుగులు వేస్తున్నాయి. వాహన తయారీకి మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్‌లో రోబోటిక్స్ వ్యాపారం కూడా కంపెనీలకు కొత్త వృద్ధి అవకాశాలను అందించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
ఫ్యాక్టరీల్లో 4 లక్షల రోబోలు.. కొత్తవాటితో పాటు హ్యూమనాయిడ్లు
టయోటా చేసిన ఈ పెట్టుబడి అంచనాలో సంస్థతో పాటు దాని గ్రూప్ కంపెనీలు, ప్రధాన సరఫరాదారులు కూడా ఉన్నారు.
ఈ మొత్తాన్ని నిజంగానే పెట్టుబడిగా పెడతారా? పెడితే ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తామనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
అయితే ఆయా సంస్థల్లో ఫ్యాక్టరీ ఆటోమేషన్‌ను విస్తృతంగా అమలు చేయాలంటే సుమారు 4 లక్షల రోబోలు అవసరమవుతాయని ఇన్వెస్టర్లకు తెలిపింది.
ఈ సంఖ్యలో ప్రస్తుతం ఉన్న రోబోలకు బదులుగా కొత్తవి ఏర్పాటు చేయడం, అదనంగా కొత్త రోబోలను వినియోగించడం రెండూ ఉన్నాయి.
ఇందులో మనుషుల ఆకారంలో ఉండే హ్యూమనాయిడ్ రోబోలతో పాటు ఇతర రకాల రోబోలు కూడా ఉంటాయి.
వివరాలు
ఫ్యాక్టరీ ఆటోమేషన్‌పై టయోటా ఫోకస్
ఈ నెల ప్రారంభంలో ఇన్వెస్టర్లతో జరిగిన చర్చల్లో టయోటా ఈ ప్రణాళికను వెల్లడించింది.
పారిశ్రామిక రోబోలు, ఆటోమేటెడ్ లాజిస్టిక్స్, భవిష్యత్‌లో మనుషులు-రోబోలు కలిసి పనిచేసే విధానాలను ఫ్యాక్టరీల్లో అమలు చేయడం ఇందులో భాగంగా ఉంటుంది.
టయోటా రోబోటిక్స్‌పై పెంచుతున్న దృష్టి వల్ల ఆటోమొబైల్ రంగానికి మించి సంస్థకు ఉన్న వృద్ధి అవకాశాలను ఇన్వెస్టర్లు మరింతగా గుర్తించే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్ విశ్లేషకులు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.
టయోటా రోబోటిక్స్ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఈ రంగానికి సంబంధించిన ప్రకటనలు మరింత తరచుగా వెలువడే అవకాశం ఉందని వారు తెలిపారు.
వివరాలు
ఫ్యాక్టరీ ఆటోమేషన్‌పై టయోటా ఫోకస్
మరోవైపు ఇతర అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలు కూడా హ్యూమనాయిడ్ రోబోల వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
హ్యూమనాయిడ్ రోబోల తయారీ సంస్థ బోస్టన్ డైనమిక్స్‌కు యజమానిగా ఉన్న హ్యుందాయ్.. 2028 నుంచి అమెరికాలోని జార్జియా ప్లాంట్‌లో హ్యూమనాయిడ్ రోబోలను వినియోగించాలని ఇప్పటికే ప్రకటించింది.