Toyota:రోల్స్-రాయిస్‌కు పోటీ: త్వరలో టయోటా కొత్త సెంచరీ
ఈ వార్తాకథనం ఏంటి
టయోటా సంస్థ తమ లెక్సస్ బ్రాండ్ కంటే పై స్థాయిలో కొత్త లగ్జరీ ఉప బ్రాండ్‌గా 'సెంచరీ (Century)' శ్రేణి కార్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. జపాన్ మార్కెట్‌లో గత 50ఏళ్లుగా ప్రీమియం సెడాన్‌గా గుర్తింపు పొందిన అదే పేరుతో ఈ బ్రాండ్‌కు నామకరణం చేశారు. రోల్స్-రాయిస్ లాంటి అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్లకు పోటీనివ్వడమే లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కొత్త సెంచరీ కార్లు,అందరి అంచనాలకి భిన్నంగా పూర్తిగా ఎలక్ట్రిక్‌గా కాకుండా సంప్రదాయ ఇంజన్‌లతోనే రానున్నాయి. ఈ విషయాన్ని టయోటా పవర్‌ట్రైన్ విభాగం అధ్యక్షుడు టాకాషీ ఉఎహారా ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేస్తూ,"కొత్త సెంచరీ మోడళ్లలో తప్పకుండా ఇంజన్ ఉంటుంది" అని తెలిపారు. అయితే ఏ రకం ఇంజన్ వాడబోతున్నారన్న వివరాలు వెల్లడించలేదు.
వివరాలు
ఒక ఆప్షన్‌గా సరికొత్త హైబ్రిడ్ ఇంజన్
ఇంజన్ ఎంపికల విషయానికి వస్తే, టర్బో చార్జ్డ్ 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల యూనిట్‌కు బ్యాటరీ సపోర్ట్ ఉండే సరికొత్త హైబ్రిడ్ ఇంజన్ (సుమారు 400 హెచ్‌పీ శక్తి) ఒక ఆప్షన్‌గా ఉందని సమాచారం. అలాగే జీఆర్ జీటీ సూపర్‌కార్ కోసం అభివృద్ధి చేస్తున్న హైబ్రిడ్ వి8 ఇంజన్‌ను కూడా ఈ లగ్జరీ కార్లలో వినియోగించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వి8 హైబ్రిడ్ ఇంజన్ 900 హెచ్‌పీకి మించి పవర్ ఇస్తుందన్న ప్రచారం ఉంది,ఇది కార్లతో పాటు ట్రక్కులు, ఎస్‌యూవీలకు కూడా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారు.
వివరాలు
వచ్చే రెండేళ్లలో రోడ్లపైకి సెంచరీ మోడళ్లు
మరోవైపు, సెంచరీ సిరీస్‌కు కొత్తగా 12 సిలిండర్ల ఇంజన్ వచ్చే అవకాశముందని వార్తలు ఉన్నప్పటికీ, వాటిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మొత్తంగా సంప్రదాయ ఇంజన్ టెక్నాలజీకే టయోటా కట్టుబడి ఉండటం స్పష్టమవుతుండగా, తొలి సెంచరీ మోడళ్లు వచ్చే రెండేళ్లలో రోడ్లపైకి రానున్నట్లు అంచనా వేస్తున్నారు.