Uber: భారత్‌లో కొత్త భద్రతా ఫీచర్లను తీసుకొచ్చిన ఉబర్.. వీడియో రికార్డింగ్, అంబులెన్స్ సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో డ్రైవర్లు, ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ (Uber) కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అంబులెన్స్ సహాయం, యాప్‌లోనే ఎన్‌క్రిప్టెడ్ వీడియో రికార్డింగ్ సదుపాయాలను ప్రవేశపెట్టింది. అక్టోబర్ 29న నిర్వహించిన మూడో ఎడిషన్ 'ఉబర్ ప్రగతి' కార్యక్రమంలో ఈ కొత్త ఫీచర్లను ప్రకటించింది. వీటితో పాటు యాప్‌లోని చాట్ ద్వారా పంపే అనుచిత సందేశాలను తక్షణమే గుర్తించే భద్రతా వ్యవస్థను కూడా పరిచయం చేసింది.
వివరాలు
అంబులెన్స్ సేవలను ఇప్పటికే 25 సార్లు వినియోగించారు
డయల్ 4242 భాగస్వామ్యంతో ఉబర్ అందిస్తున్న 24 గంటల భద్రతా హెల్ప్‌లైన్ ద్వారా అంబులెన్స్ సహాయం పొందే సదుపాయాన్ని కల్పించింది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన నాలుగు నెలలలోపే 25 సార్లు వినియోగించినట్లు సంస్థ వెల్లడించింది.
ప్రయాణ సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లు, ప్రయాణికులు వెంటనే వైద్య సహాయం పొందేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని తెలిపింది.
అలాగే డ్రైవర్లు తమ భద్రతకు సంబంధించిన ఫీచర్లు, సహాయ సేవలను ఒకేచోట సులభంగా నిర్వహించుకునేందుకు 'డ్రైవర్ సేఫ్టీ హబ్'ను కూడా యాప్‌లో ప్రవేశపెట్టింది.
వివరాలు
వివాదాల పరిష్కారానికి 'రికార్డ్ మై రైడ్' ఫీచర్
ప్రయాణ సమయంలో వీడియోలను రికార్డు చేసుకునేందుకు ఉబర్ 'రికార్డ్ మై రైడ్' అనే ఎన్‌క్రిప్టెడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రయాణికుడు, డ్రైవర్ మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడంలో ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.
ఇప్పటికే ఓ ప్రయాణికుడు, డ్రైవర్ మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడంలో ఈ ఫీచర్ కీలకంగా పనిచేసిందని వెల్లడించింది.
రికార్డు చేసిన వీడియో ఆధారంగా పోలీసులు అసలు విషయాన్ని గుర్తించగలిగారని పేర్కొంది.
మరోవైపు, యాప్‌లోని చాట్‌లలో అభ్యంతరకరమైన భాషను తక్షణమే గుర్తించే 'సేఫ్టీ కంటెంట్ ఫ్లాగ్' ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది.
అనుచిత సందేశాలు అందుకున్న డ్రైవర్లు కొన్ని అర్హత కలిగిన ప్రయాణాలను రద్దు చేసుకోవచ్చు.
అలా చేసినప్పుడు వారి క్యాన్సిలేషన్ గణాంకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ స్పష్టం చేసింది.
వివరాలు
డ్రైవర్ల కోసం ఫ్లెక్సిబుల్ డ్రైవ్ పాస్
భద్రతా ఫీచర్లతో పాటు తమ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తున్న 20 లక్షల మందికి పైగా డ్రైవర్ల ఆదాయ అవకాశాలను మరింత సులభతరం చేసే కొత్త కార్యక్రమాలను కూడా ఉబర్ ప్రకటించింది.
ఇందులో భాగంగా 'ఫ్లెక్సిబుల్ డ్రైవ్ పాస్'ను తీసుకొచ్చింది.
దీని ద్వారా ఆరు గంటల నుంచి 180 రోజుల వరకు వివిధ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ఎంచుకోవచ్చు.
పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ డ్రైవర్లకు అనుగుణంగా ఈ సదుపాయాన్ని రూపొందించింది.
అలాగే 'క్విక్‌స్టార్ట్' పేరుతో వాట్సాప్ ద్వారానే ఉబర్ ప్లాట్‌ఫామ్‌లో డ్రైవర్లు చేరే అవకాశాన్ని కల్పించింది.
దీంతో కొత్తగా డ్రైవర్లుగా చేరాలనుకునేవారికి నమోదు ప్రక్రియ మరింత సులభం కానుంది.
వివరాలు
యాప్‌లో వాయిస్ నోట్స్ సదుపాయం
డ్రైవర్ల ఖాతాలో బ్యాలెన్స్ అయిపోయినా.. అర్హత ఉన్నవారు అదనపు క్రెడిట్ పరిమితి మేరకు నగదు చెల్లింపు ప్రయాణాలను కొనసాగించేలా 'ఎర్న్ ఫస్ట్, పే లేటర్' ఫీచర్‌ను ఉబర్ అందిస్తోంది.
దీనితో పాటు యాప్‌లోని చాట్‌లో వాయిస్ నోట్స్ పంపుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది.
డ్రైవర్ల కోసం యాప్‌ను మరింత సులభతరం చేస్తూ కొత్త డ్రైవర్ యాప్‌ను రూపొందించింది.
ఇందులో ఆదాయం, ప్రయాణ వివరాలు, ముఖ్యమైన అప్‌డేట్స్ అన్నింటినీ ఒకేచోట చూసుకునే అవకాశం కల్పించింది.
ఈ మార్పులన్నీ డ్రైవర్ల పని అనుభవాన్ని మెరుగుపరిచేందుకు తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.
వివరాలు
బైక్ డ్రైవర్లకు మరిన్ని ఆదాయ అవకాశాలు
బైక్ డ్రైవర్లకు కూడా అదనపు ఆదాయ మార్గాలను కల్పించేందుకు ఉబర్ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా నగరాల మధ్య ప్రయాణాలు, ఉబర్ డైరెక్ట్ ద్వారా వ్యాపార వస్తువుల డెలివరీలు, ఉబర్ పార్సెల్ ద్వారా వ్యక్తిగత వస్తువుల పంపిణీ సేవలను విస్తరిస్తోంది.
పెంపుడు జంతువులతో ప్రయాణించే వారిని తమ కార్లలో తీసుకెళ్లేందుకు అంగీకరించే డ్రైవర్లు 'ఉబర్ పెట్' ద్వారా ఆదాయం పొందవచ్చు.
అలాగే కొత్త డ్రైవర్లను ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చే వారికి రివార్డులు అందించే 'రిఫర్ అండ్ ఎర్న్' కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తోంది.