Uber: ఉబర్ సెన్సేషన్: 2027 నాటికి లక్ష సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్డుపైకి!
ఈ వార్తాకథనం ఏంటి
ఉబర్ (Uber) మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆటోమేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తూ, భవిష్యత్తులో మానవ డ్రైవర్ల అవసరాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో 2027 నాటికి అమెరికాలోనే లక్ష (1,00,000) సెల్ఫ్ డ్రైవింగ్ కార్లతో తన సర్వీసులను విస్తరించాలనే ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్‌విడియా (Nvidia) తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే ఈ చర్యతో ఉబర్ డ్రైవర్ల ఉద్యోగాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. ఈ విషయం అమెరికాలో జరిగిన ఎన్‌విడియా సమావేశంలో వెల్లడైంది. ఉబర్, ఎన్‌విడియా అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఉబర్ 2027లో పెద్ద ఎత్తున రోబోటాక్సీ (Robotaxi)సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
వివరాలు
సిస్టమ్ ఇంటిగ్రేషన్ విషయంలో ఫాక్స్‌కాన్ సాంకేతిక సహకారం
ఈ కార్ల కోసం అవసరమైన ఏఐ ఆధారిత స్వీయ డ్రైవింగ్ టెక్నాలజీ, హార్డ్‌వేర్, సెన్సార్లు, సాఫ్ట్‌వేర్ వంటి ముఖ్యమైన అంశాలను ఎన్‌విడియా అందించనుంది. అలాగే, సిస్టమ్ ఇంటిగ్రేషన్ విషయంలో ఫాక్స్‌కాన్ (Foxconn) సంస్థ ఉబర్‌కు సాంకేతిక సహకారం అందిస్తుంది. ఈ వాహనాల రిమోట్ అసిస్టెన్స్, ఛార్జింగ్, క్లీనింగ్, మెయింటెనెన్స్,కస్టమర్ సర్వీస్ వంటి అంశాలను ఉబర్ స్వయంగా పర్యవేక్షించనుంది. ఈ కార్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి కావాల్సిన పైలట్ ప్రోగ్రామ్‌లు, టెస్టింగ్ ప్రక్రియలు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
'రోబోటాక్సీ డేటా ఫ్యాక్టరీ' నిర్మించే ఆలోచనలో ఉబర్
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉబర్ ప్రత్యేకంగా 'రోబోటాక్సీ డేటా ఫ్యాక్టరీ' నిర్మించాలని కూడా ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఉబర్ తమ సేవల కోసం లక్షల సంఖ్యలో గిగ్ వర్కర్లను (Gig Workers) ఉపయోగిస్తోంది. అయితే, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి వస్తే ఆ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే అమెరికాలోని కొన్ని నగరాల్లో ఉబర్ పరిమిత సంఖ్యలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రయోగాత్మకంగా నడుపుతోంది. మొత్తానికి, ఉబర్ తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ రంగంలో పెద్ద మైలురాయిగా నిలవనుండగా, ఉద్యోగాల భద్రతపై మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.