Tata Sierra: ఎలక్ట్రిక్ నుంచి పెట్రోల్ వరకూ.. 2026లో టాటా మోటార్స్ కొత్త కార్ల లాంచ్‌లు!
ఈ వార్తాకథనం ఏంటి
టాటా సియెర్రా ఎస్‌యూవీకి లభిస్తున్న ఘన విజయం టాటా మోటార్స్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బుకింగ్స్ ప్రారంభమైన తొలి రోజే 70 వేలకుపైగా కస్టమర్లు ఈ ఎస్‌యూవీని బుక్ చేయడం ఆటోమొబైల్ రంగంలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విజయం నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి టాటా సియెర్రా ఎలక్ట్రిక్ వేరియంట్‌పై పడింది. సియెర్రా ఈవీని కంపెనీ అభివృద్ధి చేస్తోందన్న విషయం తెలిసిందే. ఇది 2026లో మార్కెట్‌లోకి రానుందని సమాచారం. అంతేకాదు, 2026 సంవత్సరానికి టాటా మోటార్స్ భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఆ ఏడాదిలో లాంచ్‌కు సిద్ధమవుతున్న టాటా కార్ల వివరాలు ఇవే...
వివరాలు
2026లో విడుదలయ్యే టాటా కార్లు ఇవే..
1. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ అంచనా లాంచ్: 2026 ప్రారంభంలో ధర అంచనా: రూ.6లక్షల నుంచి రూ.9.5లక్షల వరకు భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నఎస్‌యూవీల్లో ఒకటైన టాటా పంచ్‌కు త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టెస్ట్ మోడళ్ల స్పై ఫోటోలు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పరంగా పంచ్ ఈవీని పోలి ఉంటుంది.కొత్త లైట్ బార్,ఆకర్షణీయమైన బంపర్,అప్‌డేటెడ్ అల్లాయ్ వీల్స్‌తో మరింత మోడర్న్ లుక్‌లో కనిపించనుంది.లోపలి భాగంలో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్,వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంజిన్ విభాగంలో మాత్రం మార్పులుండవు. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్,సీఎన్జీ ఆప్షన్లతోనే ఈ మోడల్ కొనసాగనుంది.
వివరాలు
2. టాటా సియెర్రా ఈవీ
లాంచ్: 2026 తొలి త్రైమాసికంలో ధర అంచనా:రూ.16లక్షల నుంచి రూ.25లక్షల వరకు టాటా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సియెర్రా ఈవీ 2026 మార్చి నాటికి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రియర్ వీల్ డ్రైవ్‌తో పాటు ఆల్ వీల్ డ్రైవ్(AWD)వేరియంట్లలో లభించనుంది. దీనిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన 'ఆర్గోస్' ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు.కర్వ్ ఈవీలో ఉపయోగించిన 55 kWh బ్యాటరీ లేదా హారియర్ ఈవీలో వచ్చే 65 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఈ మోడల్‌లో కూడా వినియోగించే అవకాశముంది. ఐసీఈ వేరియంట్‌తో పోలిస్తే,ఈవీ మోడల్ ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్‌తో ప్రత్యేకమైన డిజైన్‌ను అందించనుంది. హైదరాబాద్‌లో టాటా సియెర్రా ఆన్‌రోడ్ ధర వివరాలు తెలుసుకోవాలంటే సంబంధిత సమాచారం చూడవచ్చు.
వివరాలు
3. నెక్స్ట్ జనరేషన్ టాటా నెక్సాన్
అంచనా లాంచ్: 2026 చివర్లో ధర అంచనా: రూ. 8లక్షల నుంచి రూ. 17లక్షల వరకు టాటా మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ నెక్సాన్‌కు పూర్తిగా కొత్త రూపాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతోంది. 'గరుడ్' అనే కోడ్ నేమ్‌తో రూపొందుతున్న ఈ నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. దాదాపు పదేళ్ల తర్వాత నెక్సాన్‌కు ప్లాట్‌ఫామ్ మార్పు జరగనుండటం విశేషం. ఈ కొత్త తరం మోడల్‌లో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ రెండింటికీ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ ఉండనుంది.
వివరాలు
టాటా మోటార్స్ 2026లో కొత్త మోడళ్లను పరిచయం చేసే అవకాశం
అప్‌డేటెడ్ వెర్షన్‌లో 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లు ఖరారైనప్పటికీ, కఠినమైన బీఎస్7 ఎమిషన్ నిబంధనల నేపథ్యంలో డీజిల్ వేరియంట్ ఉంటుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన కొత్త మోడళ్లను కూడా టాటా మోటార్స్ 2026లో పరిచయం చేసే అవకాశముంది. మొత్తంగా చూస్తే, 2026లో ఎలక్ట్రిక్‌తో పాటు పెట్రోల్ సెగ్మెంట్లలో గట్టి పోటీ ఇవ్వడానికి టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా సియెర్రా ఈవీ, నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్ మార్కెట్ ధోరణిని మార్చే సామర్థ్యం కలవని ఆటో రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.