Loading...
Tesla: కారులో చిక్కుకుపోకుండా కొత్త నిబంధనలు.. అమెరికా కీలక నిర్ణయం
కారులో చిక్కుకుపోకుండా కొత్త నిబంధనలు.. అమెరికా కీలక నిర్ణయం

Tesla: కారులో చిక్కుకుపోకుండా కొత్త నిబంధనలు.. అమెరికా కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్లలో ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడేలా కొత్త భద్రతా నిబంధనలను తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా టెస్లా వంటి కంపెనీలు ఉపయోగిస్తున్న ఫ్లష్‌, ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్ కారణంగా ప్రమాదాల తర్వాత కారులో చిక్కుకుపోయి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని మోటార్ వాహనాల్లో అత్యవసర పరిస్థితుల్లో సులభంగా గుర్తించగలిగే, నమ్మకమైన డోర్ ఎగ్జిట్ వ్యవస్థను తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అమెరికా జాతీయ రహదారి రవాణా భద్రతా సంస్థ (NHTSA) ఆమోదించింది. దీంతో కొత్త నిబంధనల రూపకల్పన ప్రక్రియ ప్రారంభం కానుంది.

వివరాలు 

ప్రయాణికులు కారులోనే చిక్కుకుపోయిన ఘటనలు అనేకం

టెస్లాతో పాటు మరికొన్ని వాహన తయారీ సంస్థలు ఫ్లష్‌,ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్‌ను వినియోగిస్తున్నాయి.

అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు లేదా ప్రమాదాల అనంతరం ఈ డోర్లు సరిగా పనిచేయక,ప్రయాణికులు కారులోనే చిక్కుకుపోయిన ఘటనలు అనేకం నమోదయ్యాయి.

కొన్ని సందర్భాల్లో వేగంగా జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉన్నప్పటికీ, అనంతరం కారులో మంటలు చెలరేగడంతో బయటకు రాలేక మరణించిన ఘటనలు కూడా నమోదయ్యాయి.

ఈనేపథ్యంలో గత నవంబర్‌లో సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ ఇంజనీర్ NHTSAకు పిటిషన్ దాఖలు చేశారు.

ఎలక్ట్రిక్ వాహనాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నఎలక్ట్రానిక్ లేదా దాచిన డోర్ లాకింగ్, విడుదల వ్యవస్థల వల్ల తీవ్రమైన భద్రతాలోపం ఏర్పడిందని,దీనిపై కేంద్ర స్థాయిలో కొత్త భద్రతా ప్రమాణాలు రూపొందించాలని ఆయన కోరారు.

వివరాలు 

నిబంధనల రూపకల్పనకు ముందుకొచ్చిన NHTSA

ఆ పిటిషన్‌ను పరిశీలించిన NHTSA ఇప్పుడు నిబంధనల రూపకల్పనకు ముందుకొచ్చింది.

కొత్త భద్రతా ప్రమాణాలు అవసరమా అనే అంశంపై మరింత సమాచారం సేకరించి, ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నట్లు NHTSA తెలిపింది.

ఆటో భద్రతా సంస్థ సెంటర్ ఫర్ ఆటో సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ బ్రూక్స్ మాట్లాడుతూ, ఇది అమెరికా వాహన భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే కీలక ముందడుగని అన్నారు.

అయితే కొత్త నిబంధనలు త్వరగా అమల్లోకి వచ్చినా, వాహన తయారీ సంస్థలు వాటిని పూర్తిగా అమలు చేయడానికి 2030 వరకు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అత్యవసర సిబ్బంది సులభంగా కారులోకి చేరేందుకు ప్రత్యేక యాక్సెస్ పాయింట్లు

ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు రాబిన్ కెల్లీ కొత్త కార్లలో విద్యుత్ లేకున్నా పనిచేసే మాన్యువల్ డోర్ రిలీజ్ వ్యవస్థను తప్పనిసరి చేయడంతో పాటు, అత్యవసర సిబ్బంది సులభంగా కారులోకి చేరేందుకు ప్రత్యేక యాక్సెస్ పాయింట్లు ఉండాలని బిల్లు ప్రవేశపెట్టారు.

మరోవైపు, కొన్ని టెస్లా మోడల్ వై వాహనాల్లో చిన్నారులు కారులో చిక్కుకుపోయిన ఘటనలపై కూడా NHTSA ప్రత్యేక లోపాల దర్యాప్తు చేపట్టింది.

ADVERTISEMENT