layoffs: ఒకేసారి 1 లక్ష మంది ఉద్యోగుల తొలగింపు.. దిగ్గజ కంపెనీ షాకింగ్ నిర్ణయం?
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది వరకు ఉద్యోగులను తగ్గించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒలివర్ బ్లూమ్ వెల్లడించారు. గతంలో జర్మనీలో మాత్రమే 2030 నాటికి సుమారు 50 వేల ఉద్యోగాలను తగ్గిస్తామని ప్రకటించిన సంస్థ, ఇప్పుడు ఆ సంఖ్యను ప్రపంచవ్యాప్తంగా రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తుండటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో పోర్షే,ఆడి,సీట్,స్కోడా వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. కీలక మార్కెట్లలో అమ్మకాలు తగ్గడం, ముఖ్యంగా యూరప్‌లో చైనా ఆటో కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా సంస్థ లాభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యయాలను తగ్గించడం తప్పనిసరిగా మారిందని సంస్థ భావిస్తోంది.
వివరాలు
నిర్వహణ ఖర్చులు సుమారు 20 శాతం అధికంగా ఉన్నాయి: ఒలివర్ బ్లూమ్
ఉద్యోగులకు పంపిన సందేశంలో ఒలివర్ బ్లూమ్ మాట్లాడుతూ, ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే వోక్స్‌వ్యాగన్ నిర్వహణ ఖర్చులు సుమారు 20 శాతం అధికంగా ఉన్నాయని తెలిపారు.
సంస్థ మరింత సమర్థవంతంగా, బలంగా, సులభమైన నిర్వహణ విధానంతో ముందుకు వెళ్లాలంటే ఖర్చులను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా 50 వేల అదనపు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చని పేర్కొన్నారు.
అయితే అన్ని బ్రాండ్లు, అనుబంధ సంస్థలు, ప్రాంతాల్లో ఎంత మేర ఉద్యోగాల కోత అవసరమవుతుందనే అంశంపై ప్రస్తుతం సమీక్ష కొనసాగుతోందని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
2024లో 19.1 బిలియన్ యూరోలకు పడిపోయిన ఆపరేటింగ్ లాభం
జర్మనీలోని జ్వికౌ, ఎమ్‌డెన్, హానోవర్, నెకార్సుల్మ్ ప్లాంట్ల భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొంది.
ఇందులో జ్వికౌ, ఎమ్‌డెన్ ప్లాంట్లు ఎలక్ట్రిక్ కార్ల తయారీకి వినియోగిస్తున్నప్పటికీ, వాటి నిర్వహణ వ్యయం అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయ వినియోగంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని సంస్థ తెలిపింది.
ఫోక్స్‌వ్యాగన్ ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా బలహీనపడుతోంది. 2023లో 22.6 బిలియన్ యూరోలుగా ఉన్న ఆపరేటింగ్ లాభం, 2024లో 19.1 బిలియన్ యూరోలకు పడిపోయింది.
గత ఏడాది అది కేవలం 8.9 బిలియన్ యూరోలకు మాత్రమే పరిమితమైంది.
ఒకప్పుడు సంస్థకు అత్యంత లాభదాయకమైన మార్కెట్‌గా ఉన్న చైనాలో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గాయి.
వివరాలు
కార్ల దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల ప్రభావం
అమెరికాలో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదు. అక్కడ అమ్మకాలు 7 శాతానికి పైగా తగ్గాయి.
కార్ల దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల ప్రభావం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు.
మరోవైపు తక్కువ ఉత్పత్తి వ్యయంతో పాటు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకున్న చైనా కార్ల తయారీ సంస్థలు ప్రపంచ మార్కెట్లలో దూసుకెళ్తుండటంతో యూరప్‌కు చెందిన ఆటో దిగ్గజాలపై ఒత్తిడి పెరుగుతోంది.
దీంతో లాభాల మార్జిన్లు తగ్గిపోతుండగా, ఖర్చులను నియంత్రించేందుకు ఫోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
జర్మనీ వ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్ల వద్ద ఉద్యోగులు నిరసనలు
ఇప్పటికే 2024 చివర్లో భారీ సమ్మెల హెచ్చరికల తర్వాత జర్మన్ కార్మిక సంఘం ఐజీ మెటల్ (IG Metall)తో ఫోక్స్‌వ్యాగన్ ఒప్పందం కుదుర్చుకుని,2030నాటికి తమ ప్రధాన బ్రాండ్‌లో 35వేల ఉద్యోగాలు,ఇతర బ్రాండ్లలో మరో 15వేల ఉద్యోగాలు తగ్గించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం చర్చలో ఉన్న తాజాప్రణాళికలు మాత్రం ఆ నిర్ణయాల కంటే మరింత విస్తృతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల జర్మనీ వ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్ల వద్ద ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.
కార్మికప్రతినిధులు,సంస్థ యాజమాన్యం పాల్గొనే సూపర్వైజరీ బోర్డు సమావేశానికి ముందు ఈ ఆందోళనలు చోటుచేసుకున్నాయి.
అయితే లక్ష ఉద్యోగాలకోత అనే సంఖ్యను చర్చల్లో ఒత్తిడి తీసుకురావడానికే సంస్థ ముందుకు తెచ్చి ఉండవచ్చని,తుదిసంఖ్య అంతకంటే తక్కువగా ఉండే అవకాశముందని కొందరు పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.