VinFast: భారత్‌లోకి విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్.. 450 కి.మీ రేంజ్‌తో ఫ్యామిలీ ఈవీ ఎంపీవీ!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో మరో కీలక మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. వియత్నాం ఆటో మొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ (VinFast) తన లైనప్‌లోకి మరో శక్తివంతమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని జోడించేందుకు సిద్ధమవుతోంది. 'లిమో గ్రీన్' పేరుతో రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఇప్పటికే భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్‌ల సమయంలో కెమెరాలకు చిక్కింది. భారత మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ, బీవైడీ ఈ-మాక్స్ 7 వంటి మోడళ్లకు ఇది ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది.
Details
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్
ఇప్పటికే వీఎఫ్6, వీఎఫ్7 ఎస్‌యూవీలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విన్‌ఫాస్ట్ సంస్థ, ఇప్పుడు కుటుంబ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విశాలమైన ఎలక్ట్రిక్ ఎంపీవీని తీసుకురాబోతోంది. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఫిబ్రవరి 2026లో భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి. కొలతలు, డిజైన్ లిమో గ్రీన్ సంప్రదాయ ఎంపీవీ డిజైన్‌ను కలిగి, హుందాగా కనిపిస్తుంది. విన్‌ఫాస్ట్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే 'వీ' ఆకారపు సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పొడవు: 4,740 ఎంఎం వెడల్పు: 1,872 ఎంఎం ఎత్తు: 1,728 ఎంఎం
Details
బ్యాటరీ, పర్ఫార్మెన్స్
బీవైడీ ఈ-మాక్స్ 7తో పోలిస్తే, విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ 30 ఎంఎం ఎక్కువ పొడవు, 62 ఎంఎం ఎక్కువ వెడల్పు కలిగి ఉంటుంది. దీంతో క్యాబిన్‌లో ప్రయాణికులకు మరింత విశాలమైన స్థలం లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో లభ్యమైన సమాచారం ప్రకారం, లిమో గ్రీన్‌లో శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. బ్యాటరీ సామర్థ్యం: 60.13 కేడబ్ల్యూహెచ్ రేంజ్: ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో సుమారు 450 కిలోమీటర్లు మోటార్ పవర్: 201 హెచ్‌పీ టార్క్: 280 ఎన్‌ఎం ఛార్జింగ్ విషయానికి వస్తే 80 కేడబ్ల్యూహెచ్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
Details
ఫీచర్లు, భద్రత
లిమో గ్రీన్ ఇంటీరియర్ డిజైన్ సింపుల్‌గా, ఆధునిక హంగులతో రూపొందించారు. ఇందులో 2+3+2 సీటింగ్ లేఅవుట్‌తో 7 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. టెక్నాలజీ ఫీచర్లు 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 4 స్పీకర్ల ఆడియో సిస్టమ్ సింగిల్ జోన్ ఎయిర్‌కండీషనర్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టులు భద్రత 4 ఎయిర్‌బ్యాగ్‌లు ఏబీఎస్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే, ఈ మోడల్‌లో ప్రస్తుతం ఏడాస్ (ADAS) ఫీచర్లు లేవు అనే విషయం గమనార్హం. మొత్తానికి, పెద్ద కుటుంబాలు, దీర్ఘ ప్రయాణాల్లో సౌకర్యాన్ని కోరుకునే వినియోగదారులకు విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలవనుంది. దీని ధరతో పాటు ఇతర పూర్తి వివరాలను ఫిబ్రవరి 2026లో కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.
Details
ఆ తర్వాత విన్‌ఫాస్ట్ వీఎఫ్5
భారత ఈవీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని విన్‌ఫాస్ట్ సంస్థ దూకుడుగా ప్రణాళికలు అమలు చేస్తోంది. లిమో గ్రీన్ తర్వాత 'విన్‌ఫాస్ట్ వీఎఫ్5' పేరుతో మరో ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది హ్యాచ్‌బ్యాక్ మోడల్ అయినప్పటికీ, డిజైన్ పరంగా ఒక ఎస్‌యూవీలా కనిపించనుంది.