Winfast Electric SUVs: విన్ఫాస్ట్ వీఎఫ్6, వీఎఫ్7.. ఒక్క ఛార్జ్‌లో 460 కి.మీ పైగా రేంజ్!
ఈ వార్తాకథనం ఏంటి
వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్ఫాస్ట్ భారత మార్కెట్‌లో అధికారికంగా తమ తొలి మోడళ్ల డెలివరీలను ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్లను వినియోగదారులకు అందజేసింది. సెప్టెంబర్ 2025లో భారత్‌లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించిన కొన్ని వారాలకే డెలివరీలు మొదలయ్యాయి. ఈ తొలి బ్యాచ్ ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే కొచ్చి, జైపూర్ వంటి పలు నగరాల్లోని కస్టమర్లకు చేరుకున్నాయి. భారత్‌లో తయారీ, రిటైల్, సర్వీస్ నెట్‌వర్క్‌ల గురించి సంస్థ తమ దీర్ఘకాలిక ప్రణాళికలను ఆవిష్కరించిన వెంటనే ఈ డెలివరీలు జరగడం గమనార్హం. ఈ రెండు మోడళ్లను ప్రస్తుతం తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న వినఫాస్ట్ ఫ్యాక్టరీలో అసెంబ్లింగ్ చేస్తున్నారు.
Details
విన్ఫాస్ట్ వీఎఫ్6: ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
విన్ఫాస్ట్ వీఎఫ్6 అనేది కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి వస్తుంది. రూ. 20 లక్షల లోపు బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, మంచి రేంజ్‌ను ఆశించే యువ నగర కొనుగోలుదారులను ఇది లక్ష్యంగా చేసుకుంది. వీఎఫ్6 ఎక్స్‌షోరూమ్ ధరలు రూ. 16.49 లక్షల నుంచి రూ. 18.29 లక్షల వరకు ఉన్నాయి. ఇది ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ అనే మూడు ట్రిమ్స్‌లో లభిస్తుంది. ఈ వాహనంలో 59.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి అమర్చిన ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 201 హెచ్‌పీ పవర్, 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. విన్ఫాస్ట్ ప్రకారం వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే 468 కి.మీ రేంజ్ ఇస్తుంది.
Details
25 నిమిషాల్లోనే 70శాతం ఛార్జింగ్
ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 10 శాతం నుంచి 70 శాతం ఛార్జింగ్ కేవలం 25 నిమిషాల్లో పూర్తవుతుంది! అంతేకాదు ఈ ఎస్‌యూవీ 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని 8.9 సెకన్లలో చేరుకుంటుంది. ఇది పట్టణ, హైవే డ్రైవింగ్‌కు సరిపోతుంది. ఈ కారు లోపల అధునాతనంగా, ఫీచర్లతో నిండి ఉంటుంది. 12.9-ఇంచ్ టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, 360° కెమెరా, అడాస్ సేఫ్టీ సూట్ దీని ప్రత్యేకతలు. ఇందులో ప్రామాణికంగా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. విన్ఫాస్ట్ తమ ఉత్పత్తిపై నమ్మకాన్ని తెలియజేస్తూ 7 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిమీ వారంటీని, ప్రారంభ ఆఫర్‌గా ఛార్జింగ్ బెనిఫిట్ ప్యాకేజీని అందిస్తోంది!
Details
విన్ఫాస్ట్ వీఎఫ్7: ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
విన్ఫాస్ట్ వీఎఫ్7 అనేది వీఎఫ్6 కంటే ఒక సెగ్మెంట్ ఎక్కువైన మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఎక్కువ శక్తి, మెరుగైన రేంజ్, విశాలమైన స్థలం కోరుకునే కొనుగోలుదారులను ఇది టార్గెట్ చేస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల వరకు ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ, స్కై, స్కై ఇన్ఫినిటీ అనే ఐదు ట్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీఎఫ్7 రెండు బ్యాటరీ ప్యాక్‌లలో (59.6 కేడబ్ల్యూహెచ్, 70.8 కేడబ్ల్యూహెచ్) లభిస్తుంది. వీటి రేంజ్ 468 కి.మీ నుంచి 530 కి.మీ మధ్యలో ఉంటుంది. అలాగే 2డబ్ల్యూడీ లేదా ఏడబ్ల్యూడీ (ఆల్-వీల్-డ్రైవ్) డ్రైవ్‌ట్రెయిన్‌లను ఎంచుకోవచ్చు.
Details
5.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ
పవర్ అవుట్‌పుట్ తక్కువ వేరియంట్‌లో 175 హెచ్‌పీ (250 ఎన్ఎమ్) నుంచి ఏడబ్ల్యూడీ వేరియంట్‌లో అత్యధికంగా 350 హెచ్‌పీ (500 ఎన్ఎమ్) వరకు ఉంటుంది. టాప్-రేంజింగ్ వీఎఫ్7 కేవలం 5.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట రేంజ్ 510 కిమీ వరకు ఉంటుంది. వీఎఫ్6 మాదిరిగానే, వీఎఫ్7 కూడా లగ్జరీతో కూడిన, సాంకేతికతతో నిండిన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. కనెక్టెడ్ ఫంక్షన్లు, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అడాస్, టాప్ ట్రిమ్స్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ దీని ప్రత్యేకతలు. ఈ మోడల్‌కు కూడా 10 సంవత్సరాలు లేదా 2 లక్షల కి.మీల వారంటీ లభిస్తుంది.