LOADING...
Lego Car: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లెగో కారు.. గంటకు 111 కి.మీ వేగంతో కొత్త రికార్డు!
గంటకు 111 కి.మీ వేగంతో కొత్త రికార్డు!

Lego Car: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లెగో కారు.. గంటకు 111 కి.మీ వేగంతో కొత్త రికార్డు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

లెగో బొమ్మలు అంటే పిల్లలు ఆడుకునే ఆట వస్తువులే అనుకునే రోజులు పోయాయి. ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌కు సవాల్ విసురుతూ లెగో సంస్థ, కోయెనిగ్‌సెగ్‌తో కలిసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే లెగో కారును రూపొందించింది. కోయెనిగ్‌సెగ్ సదైర్స్ స్పియర్ హైపర్‌కార్‌ను పోలిన ఈ భారీ మోడల్ తాజాగా బ్రిటన్‌లోని ప్రసిద్ధ గుడ్‌వుడ్ ట్రాక్‌పై గంటకు 111 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తి డ్రైవ్ చేయగల లెగో వాహనాల్లో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఘనత సాధించిన లెగో కారు ఫెరారీ, లంబోర్ఘిని లేదా బుగట్టి మోడల్ కాదు. అత్యంత అరుదైన కోయెనిగ్‌సెగ్ సదైర్స్ స్పియర్ హైపర్‌కార్ ఆధారంగా దీనిని రూపొందించారు.

వివరాలు 

50 కి.మీ వేగానికే పరిమితమైన మెక్‌లారెన్ పీ1 కారు

గతంలో లెగోతో నిర్మించిన మెక్‌లారెన్ పీ1 కారు దాదాపు 50 కి.మీ వేగానికే పరిమితమైంది. అయితే తాజా లెగో కారు ఆ రికార్డును రెండింతలకు పైగా అధిగమించింది. కోయెనిగ్‌సెగ్ టెస్ట్ డ్రైవర్ మార్కస్ లుంద్ ఈ కారును నడిపి రికార్డు సృష్టించారు. ఈ లైఫ్‌సైజ్ లెగో కారు ప్రధానంగా లెగో టెక్నిక్ భాగాలతో నిర్మించినప్పటికీ, నిజమైన కారులా రోడ్లపై నడిచేలా రూపొందించారు. లెగో ఇంజినీరింగ్ సామర్థ్యం ఎంతగా అభివృద్ధి చెందిందో ఈ వాహనం మరోసారి నిరూపించింది.

వివరాలు 

డిజైన్, నిర్మాణ పనులకు కలిపి 9,400 గంటలకు పైగా సమయం

ఈ కారు నిర్మాణం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం 3,27,906 లెగో టెక్నిక్ భాగాలను ఉపయోగించి దీన్ని తయారు చేశారు. డిజైన్, నిర్మాణ పనులకు కలిపి 9,400 గంటలకు పైగా సమయం పట్టింది. దాదాపు 1,800 కిలోల బరువున్న ఈ వాహనంలో అసలు హైపర్‌కార్‌లో ఉండే అనేక ఫీచర్లను అందించారు. ముఖ్యంగా "ఘోస్ట్ మోడ్" సిస్టమ్ ద్వారా ఒక బటన్ నొక్కగానే డోర్లు, బోనెట్, సైడ్ మిర్రర్లు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయి.

Advertisement

వివరాలు 

2026 జూలై నుంచి విక్రయాలకు..

కొత్త లెగో టెక్నిక్ కోయెనిగ్‌సెగ్ సదైర్స్ స్పియర్ మోడల్ విడుదలను పురస్కరించుకుని ఈ భారీ కారును రూపొందించారు. పెద్దల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సెట్‌లో 4,104 లెగో భాగాలు ఉన్నాయి. ఇందులో పనిచేసే వీ8 ఇంజిన్, తొమ్మిది స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్, ట్రిప్లెక్స్ సస్పెన్షన్, ఘోస్ట్ మోడ్ వంటి ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా 2026 జూలై నుంచి విక్రయాలకు రానుంది. గంటకు 111 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ద్వారా లెగోతో తయారైన వాహనాలు కేవలం ప్రదర్శనకే పరిమితం కావని ఈ కారు చాటిచెప్పింది. లెగో ఇంజినీరింగ్‌కు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిన ఈ కోయెనిగ్‌సెగ్ సదైర్స్ స్పియర్ ప్రతిరూపం ఆటోమొబైల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Advertisement