LOADING...
Xiaomi : చైనా ఈవీ మార్కెట్‌లో షియోమీ దూకుడు.. 22 నెలల్లో 6 లక్షల డెలివరీలు పూర్తి
చైనా ఈవీ మార్కెట్‌లో షియోమీ దూకుడు.. 22 నెలల్లో 6 లక్షల డెలివరీలు పూర్తి

Xiaomi : చైనా ఈవీ మార్కెట్‌లో షియోమీ దూకుడు.. 22 నెలల్లో 6 లక్షల డెలివరీలు పూర్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

షియోమీ సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో కీలక మైలురాయిని అందుకుంది. 2024 ఏప్రిల్‌లో తొలి డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 22 నెలల్లోనే ప్రయాణికుల వాహనాల డెలివరీలు మొత్తం 6 లక్షలు దాటినట్లు Xiaomi సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. చైనా న్యూ ఎనర్జీ వెహికల్ (NEV) మార్కెట్‌లో నెలవారీగా బలమైన అమ్మకాలు నమోదు కావడం దీనికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. 2026 జనవరిలో మాత్రమే 39,002 వాహనాలు డెలివరీ చేయగా, అందులో సుమారు 97 శాతం YU7 ఎస్‌యూవీ వాటానే ఉండటం విశేషం. దీంతో జనవరిలో చైనాలో రిటైల్ అమ్మకాల పరంగా YU7 ఒక్క మోడల్‌గా టాప్ ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.

వివరాలు 

2025 డిసెంబరులో 50 వేలకుపైగా వాహనాలు డెలివరీ

2025 సంవత్సరంలో షియోమీ ఈవీ డెలివరీలు 4.10 లక్షలు దాటగా, ఇది సంస్థ నిర్ణయించుకున్న లక్ష్యాన్ని మించిపోయింది. ముఖ్యంగా 2025 డిసెంబరులో ఒక్క నెలలోనే 50 వేలకుపైగా వాహనాలు డెలివరీ కావడం గమనార్హం. 2025 మధ్యలో విడుదలైన మధ్యతరహా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ YU7 కేవలం ఆరు నెలల్లోనే 1.5 లక్షలకుపైగా యూనిట్లు అమ్ముడవగా, ఇది ముందు వచ్చిన SU7 సెడాన్ అమ్మకాల కంటే రెట్టింపు స్థాయిలో ఉంది. 2026 జనవరిలో మార్కెట్ కొంత మందగించినా, ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో డిమాండ్ బలంగా ఉండటంతో YU7 తన స్థానం నిలుపుకుంది.

వివరాలు 

2026 సంవత్సరానికి 5.5 లక్షల వాహనాల డెలివరీనే లక్ష్యం 

YU7 మోడల్ చైనాలో మధ్యతరహా ఎస్‌యూవీ విభాగంలో నేరుగా టెస్లా మోడల్ వైతో పోటీ పడుతోంది. ఇక తొలి మోడల్ అయిన SU7 సెడాన్ ఉత్పత్తి ఇటీవల ముగిసింది. 2026లో కనీసం నాలుగు కొత్త మోడళ్లను తీసుకురావాలని షియోమీ యోచిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ లే జున్ 2026 సంవత్సరానికి 5.5 లక్షల వాహనాల డెలివరీ లక్ష్యాన్ని మళ్లీ స్పష్టం చేశారు. ఇది 2025 పనితీరుతో పోలిస్తే సుమారు 34 శాతం వృద్ధి. భవిష్యత్తులో ఎగుమతులపై కూడా దృష్టి పెట్టిన షియోమీ, 2027 నాటికి యూరప్ మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశాలపై పరిశీలన చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement