Xiaomi EV Cars:మొబైల్స్ నుంచి మోటార్స్ వరకు షియోమి దూకుడు.. 2026లో 5.5 లక్షల ఈవీల ఉత్పత్తే లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
స్మార్ట్‌ఫోన్లు, ఫిట్‌నెస్ ట్రాకర్లతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించిన షియోమి (Xiaomi) ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల (EV) రంగంలోనూ అదే వేగాన్ని చూపిస్తోంది. ఫోన్లు లాంచ్ చేసే స్పీడ్‌లోనే ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తూ, ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల జరిగిన లైవ్ స్ట్రీమ్‌లో షియోమి సీఈవో లే జున్ (Lei Jun) కంపెనీ భవిష్యత్ EV ప్లాన్లపై కీలక అప్‌డేట్స్ వెల్లడించారు. 2026 నాటికి 5.5 లక్షల ఎలక్ట్రిక్ కార్ల డెలివరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. 2025తో పోలిస్తే ఈసారి మరింత దూకుడు పెంచాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపారు.
Details
షియోమి తొలుత 3,50,000 EVల డెలివరీ టార్గెట్
వాస్తవానికి 2025 కోసం షియోమి తొలుత 3,50,000 EVల డెలివరీ టార్గెట్ పెట్టుకుంది. కానీ ఆ లక్ష్యాన్ని డిసెంబర్ ప్రారంభంలోనే పూర్తి చేసి సంచలనం సృష్టించింది. ఏడాది ముగిసే సరికి 4,10,000కి పైగా యూనిట్లు డెలివరీ చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో నిరూపించింది. ఇప్పుడు 4,10,000 నుంచి 5,50,000 యూనిట్లకు వెళ్లాలంటే దాదాపు 34 శాతం వృద్ధి సాధించాలి. EV రంగంలో కొత్తగా అడుగుపెట్టిన కంపెనీకి ఇది చిన్న విషయం కాదు. అయితే గతంలో అసాధ్యమనుకున్న లక్ష్యాలను కూడా సాధించిన షియోమి ట్రాక్ రికార్డ్ చూస్తే, 2026 టార్గెట్‌ను కూడా అందుకునే అవకాశం బలంగా కనిపిస్తోంది
Details
షియోమి EV ప్రయాణం ఎలా మొదలైంది?
షియోమి తన ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణాన్ని మార్చి 30, 2021న అధికారికంగా ప్రకటించింది. అప్పటికే టెస్లా సహా పలువురు చైనా బ్రాండ్లు EV మార్కెట్‌ను శాసిస్తున్నాయి. "ఇంత ఆలస్యంగా వచ్చి ఏమి చేస్తారు?" అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ షియోమి ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, EV రంగంలో అత్యంత వేగంగా లాభాలు ప్రకటించిన కంపెనీగా నిలిచింది . ముఖ్యంగా 2025 మూడో త్రైమాసికం (Q3) లో 1,08,796 EVలను డెలివరీ చేయడంతో షియోమి EV విభాగం తొలిసారి లాభాల్లోకి వచ్చింది. సాధారణంగా కొత్త ఆటోమొబైల్ కంపెనీలు లాభాలు ప్రకటించడానికి ఎన్నో ఏళ్లు పడుతుంటే, షియోమి మాత్రం చాలా తక్కువ సమయంలోనే ప్రాఫిట్స్ సాధించడం విశేషం.
Details
ప్రస్తుతం ఉన్న ప్రధాన మోడల్స్
షియోమి EV విజయానికి ప్రధానంగా రెండు మోడల్స్ కీలకంగా నిలిచాయి. SU7 - స్టైలిష్ ఎలక్ట్రిక్ సెడాన్ YU7 - భారీ సైజ్ SUV ఈ రెండు మోడల్స్ కంపెనీని EV మార్కెట్‌లో బలంగా నిలబెట్టాయి. అయితే 2026 డెలివరీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరిన్ని వెరైటీ మోడల్స్ అవసరమని షియోమి గుర్తించింది. అందుకే 2026లో నాలుగు కొత్త కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది
Details
2026లో రానున్న కొత్త కార్లు
SU7 Facelift - పాపులర్ సెడాన్‌కు డిజైన్, ఫీచర్స్ అప్‌గ్రేడ్ SU7 Executive Version - లగ్జరీ ప్రియుల కోసం ప్రత్యేక ఎడిషన్ Extended-Range 7-Seater SUV - 7 సీట్లతో లాంగ్ డ్రైవ్‌ల కోసం Extended-Range 5-Seater SUV - 5 సీట్లతో కాంపాక్ట్ SUV
Details
Extended-Range EVలు అంటే ఏమిటి?
చాలామందికి వచ్చే ప్రశ్న ఇదే. ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లు పూర్తిగా బ్యాటరీపై మాత్రమే నడుస్తాయి. కానీ Extended-Range EVల్లో చిన్న పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఈ ఇంజిన్ నేరుగా చక్రాలను నడపదు, కానీ ప్రయాణం మధ్యలో బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. దీంతో ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి, ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. భారతదేశం లాంటి ఇంకా ఛార్జింగ్ నెట్‌వర్క్ పూర్తిగా విస్తరించని దేశాలకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. 2026 మొదటి అర్ధభాగం : SU7 Facelift, 7-Seater SUV 2026 రెండో అర్ధభాగం : SU7 Executive Version, 5-Seater SUV ఈ వ్యూహంతో ఏడాది పొడవునా EV మార్కెట్‌లో హైప్ కొనసాగించాలని షియోమి ప్లాన్ చేస్తోంది.
Details
ఇక షియోమి కేవలం 'ఫోన్ కంపెనీ' కాదు
ఇప్పటికే మార్కెట్ షియోమి కార్లను భారీగా ఆదరిస్తోంది. 2025 డిసెంబర్‌లో ఒక్క నెలలోనే 50,000కి పైగా EVలను డెలివరీ చేసి కంపెనీ కొత్త చరిత్ర సృష్టించింది. ఈ నెలాఖరులో చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ (CPCA) అధికారిక రిపోర్టు విడుదల కానున్నప్పటికీ, ఇప్పటివరకు వచ్చిన గణాంకాలే షియోమి EV భవిష్యత్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా చెబుతున్నాయి. ఫోన్లతో మొదలైన షియోమి ప్రయాణం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లతో గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. 2026 టార్గెట్‌ను సాధిస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద EV తయారీ సంస్థల జాబితాలో షియోమి కూడా చేరడం ఖాయం. ఈ వేగాన్ని చూస్తే షియోమి ఎలక్ట్రిక్ కార్ల ప్రయాణం సులభంగా అనిపించినా, దాని వెనుక ఉన్న వ్యూహం అసాధారణమేనని చెప్పొచ్చు.