Silver price crash: వెండి దూకుడుకు బ్రేక్… ఫ్యూచర్స్ మార్కెట్‌లో భారీ పతనం
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరల పరుగుకు ఒక్కసారిగా విరామం లభించింది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి భారీగా కుప్పకూలింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో మార్చి కాంట్రాక్ట్‌కు చెందిన వెండి కిలో ధర కేవలం గంట వ్యవధిలోనే సుమారు రూ.21 వేల వరకు పడిపోయింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.2,54,174 స్థాయిని గరిష్ఠంగా తాకగా, ఆ తరువాత రూ.2,33,120 వరకు దిగజారింది. ఇదే సమయంలో స్పాట్ మార్కెట్‌లోనూ వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం వరకు రూ.2.50 లక్షలకు పైగా ఉన్న కిలో వెండి ధర మధ్యాహ్నం 3 గంటల నాటికి రూ.2.39 లక్షల స్థాయికి చేరింది.
వివరాలు
కొంతకాలంగా బంగారం,వెండిపై అసాధారణ డిమాండ్ నెలకొంది
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరగడంతో గత కొంతకాలంగా బంగారం,వెండిపై అసాధారణ డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా వెండి మాత్రం గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా కాలం 50 డాలర్ల దిగువనే ట్రేడైన వెండి ధర ఇటీవల ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఈ క్రమంలో సోమవారం ఒక దశలో ఔన్స్ వెండి ధర 80 డాలర్లను కూడా దాటింది. అయితే, గరిష్ఠ స్థాయిల వద్ద పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో ధర ఒక్కసారిగా క్షీణించింది.
వివరాలు
వెండి ధర పడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే..
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంపై పుతిన్, జెలెన్‌స్కీ ఇద్దరూ పూర్తిస్థాయిలో సానుకూలంగా ఉన్నారని ట్రంప్ వెల్లడించడం యుద్ధానికి ముగింపు పడవచ్చన్న ఆశలను పెంచింది. ఈ అంచనాల నేపథ్యంలో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధర సుమారు 181 శాతం మేర పెరిగింది. ఇంతటి గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాలను తీసుకోవడం కూడా ధర పతనానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వెండి ధర 200 రోజుల మూవింగ్ యావరేజీతో పోలిస్తే సుమారు 89 శాతం పైగా ట్రేడవుతోంది.
వివరాలు
వెండి ధర పడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే..
అలాగే, వెండిలో అమ్మకాల ఒత్తిడి పెరగడానికి చికాగో మర్చంట్ ఎక్స్ఛేంజ్ (CME) తీసుకున్న నిర్ణయమూ ఒక కారణంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్‌లను నిర్వహించే ఈ సంస్థ 2026 మార్చి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన మార్జిన్‌ను 20 వేల డాలర్ల నుంచి 25 వేల డాలర్లకు పెంచింది. దీంతో అధిక రిస్క్‌తో ట్రేడింగ్ చేసే పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం వల్ల వెండిలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగిందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.