LOADING...
EPF: దేశవ్యాప్తంగా 8.5 లక్షల పీఎఫ్ ఖాతాలు నిష్క్రియలో… వేల కోట్ల నిధులు నిల్వ
దేశవ్యాప్తంగా 8.5 లక్షల పీఎఫ్ ఖాతాలు నిష్క్రియలో… వేల కోట్ల నిధులు నిల్వ

EPF: దేశవ్యాప్తంగా 8.5 లక్షల పీఎఫ్ ఖాతాలు నిష్క్రియలో… వేల కోట్ల నిధులు నిల్వ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశమంతటా సుమారు 8.5 లక్షల పీఎఫ్‌ ఖాతాలు పదేళ్లకు పైగా చురుకుగా లేకుండా నిష్క్రియ స్థితిలో ఉన్నాయని కేంద్ర ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గుర్తించింది. ఈ ఖాతాల్లో 13,705 ఖాతాల్లో ఒక్కో దాంట్లో సగటున రూ.40 లక్షలకు పైగా నిధులు నిల్వగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ నిష్క్రియ ఖాతాల సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎస్‌బీఐ తదితర బ్యాంకులు అనుసరించిన విధానాలను పరిశీలిస్తూ, రిజర్వ్‌ బ్యాంక్‌ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి ఈపీఎఫ్‌వో సూచనలు జారీ చేసింది. ఆధార్‌కు అనుసంధానమైన పీఎఫ్‌ ఖాతాదారుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపించడం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

వివరాలు 

అధ్యయనంలో వెల్లడైన అంశాలు

అలాగే, ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్లు సంస్థల యాజమాన్యాలతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈపీఎఫ్‌వో గణాంకాల ప్రకారం దాదాపు 25 వేలకుపైగా ఖాతాల్లో ఒక్కో దాంట్లో కనీసంగా రూ.5 లక్షలకు మించి నిల్వ ఉంది. అలాగే 13,705 నిష్క్రియ ఖాతాల్లో సగటున ఒక్కో ఖాతాలో రూ.40 లక్షలకు పైగా డబ్బు ఉన్నట్లు తేలింది. దీర్ఘకాలంగా రూ.10 లక్షలకు మించి నిల్వలున్న ఖాతాల్లో మొత్తం రూ.5,235.32 కోట్లు నిల్వగా ఉన్నాయి. వీటిలో 2,431 ఖాతాలను పరిష్కరించి, సంబంధిత చందాదారులకు రూ.1,028.75 కోట్లు చెల్లించారు. విదేశీ కార్మికులకు చెందిన 3,033 ఖాతాల్లో రూ.704.72 కోట్లు ఉన్నప్పటికీ, అవి నిర్వహణలో లేకపోవడంతో వడ్డీ జమ కావడం లేదు.

వివరాలు 

కేవైసీ వివరాల్లో తేడాలు

నిష్క్రియ ఖాతాల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఉద్యోగంలో చేరినప్పుడు పీఎఫ్‌ఖాతా ప్రారంభించబడిందనే విషయం కొందరికి తెలియకపోవడం, పథకం గురించి సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించారు. కొంతమంది ఉద్యోగులు కొత్తసంస్థలకు మారిన తర్వాత పాత సంస్థలోని పీఎఫ్‌ ఖాతాను బదిలీ చేయకపోవడం వల్ల అవి నిష్క్రియంగా మారుతున్నాయి. కొత్త సంస్థలో చేరిన వెంటనే పాత పీఎఫ్‌ ఖాతాలను బదిలీ చేసుకోవాలని ఈపీఎఫ్‌వో ఇప్పటికే సూచించింది. కొందరికి ఖాతాలు ఉన్నప్పటికీ,అందులో ఉన్న మొత్తంపై స్పష్టత లేకపోవడం గమనించబడింది. విదేశీ కార్మికుల వర్గీకరణలో లోపాలు ఉండటం మరో సమస్యగా తేలింది. అలాగే కార్మికుల కేవైసీ వివరాలు పీఎఫ్‌ ఖాతాలోని వివరాలతో సరిపోకపోవడం వల్ల సెటిల్‌మెంట్‌ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Advertisement