Patanjali: ప్రపంచ విస్తరణలో పెద్ద అడుగు.. రష్యా మార్కెట్లోకి పతంజలి బ్రాండ్ ప్రవేశం
ఈ వార్తాకథనం ఏంటి
బాబా రామ్‌దేవ్ నాయకత్వంలోని పతంజలి గ్రూపు రష్యా మార్కెట్‌లోకి ప్రవేశానికి తొలి అడుగు వేసింది. ఇందుకోసం రష్యా ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఆరోగ్యం, సంరక్షణ సేవలు, వైద్య పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం, నైపుణ్య మానవ వనరుల మార్పిడి, పరిశోధన కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి అంశాలు రెండు దేశాల మధ్య ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు. ఈ ఎంఓయూపై పతంజలి తరపున బాబా రామ్‌దేవ్, ఇండో-రష్యా బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్, రష్యా మంత్రి సెర్గీ చెర్మిన్ సంతకాలు చేశారు.
Details
200 దేశాలకు విస్తరించాలని ప్లాన్
పతంజలి గ్రూపు ప్రస్తుతం పతంజలి ఆయుర్వేద్, పతంజలి ఫుడ్స్ ద్వారా ఆయుర్వేద, ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులను భారత్‌లో విస్తృతంగా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఒప్పందంతో ఆ సంస్థ రష్యాతో ఆరంభించి దాదాపు 200 దేశాలకు వెల్‌నెస్ సేవలను విస్తరించాలనే భవిష్యత్ లక్ష్యంను ప్రకటించింది. అదనంగా ఈ ఎంఓయూ పరిధిలో భారతీయ ప్రముఖ బ్రాండ్లను రష్యాలో, రష్యా బ్రాండ్లను భారత మార్కెట్‌లో ప్రమోట్ చేసే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పతంజలి అంతర్జాతీయ విస్తరణలో ఇది కీలకమైన మైలురాయిగా నిపుణులు భావిస్తున్నారు.