టీసీఎస్‌ను కుదిపేస్తున్న ఉద్యోగాల కుంభకోణం; రూ.100 కోట్ల అక్రమార్జన
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ను ఉద్యోగాల కుంభకోణం కుదిపేస్తోంది. కంపెనీలోని కొంతమంది సీనియర్ సిబ్బంది ఉద్యోగుల నియాకమ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడినట్లు బయటకు వచ్చింది. ఉద్యోగాలు ఇవ్వడానికి స్టాఫింగ్ సంస్థల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు వెలుగు చూసింది. దీంతో కంపెనీ తన రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్(ఆర్‌ఎంజీ)నుంచి నలుగురు అధికారులను తొలగించింది. అంతేకాకుండా మూడు స్టాఫింగ్ సంస్థలపై నిషేధం విధించింది. స్టాఫింగ్ సంస్థల నుంచి ఆర్‌ఎంజీ గ్లోబల్ హెడ్ చక్రవర్తి కమీషన్లను స్వీకరిస్తున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో టీసీఎస్ యాజమాన్యం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. టీసీఎస్‌లో ఇలాంటి కుంభకోణం జరగడం ఇదే తొలిసారి. కంపెనీ సీఈఓగా కృతివాసన్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఈ కుంభకోణం వెలుగుచూడటం గమనార్హం.
కుంభకోణంపై విచారణకు కమిటీ ఏర్పాటు
కుంభకోణం ఆరోపణలపై విచారణకు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మీనన్‌తో సహా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కంపెనీ ఏర్పాటు చేసింది. విచారణ ముగిసే వరకు టీసీఎస్ తన రిక్రూట్‌మెంట్ హెడ్‌ని సెలవుపై పంపింది. గత మూడేళ్లలో స్టాఫింగ్ సంస్థల ద్వారా టీసీఎస్ 3,00,000 మందిని నియమించుకున్నట్లు ఒక ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఈ కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తులు కమీషన్ల ద్వారా కనీసం రూ.100 కోట్లు సంపాదించి ఉండవచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి. కుంభకోణం వార్త తెలిసిన కంపెనీ మేనెజ్‌మెంట్ దిగ్భ్రాంతి చెందిందనిట్లు సీనియర్ అధికారి వెల్లడించారు. టీసీఎస్‌కు చెందిన ఆర్‌జీఎం విభాగం సగటున నిమిషానికి ఒక ఉద్యోగిని నియమిస్తుంది.