India Exports October 2026: దేశ ఎగుమతుల్లో సరికొత్త రికార్డు.. అక్టోబరులో 29.9 శాతం వృద్ధి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ఎగుమతులు సరికొత్త రికార్డు సృష్టించాయి. అక్టోబరు నెలలో వస్తు, సేవల ఎగుమతులు కలిపి 29.9 శాతం వృద్ధితో 89.99 బిలియన్ డాలర్లకు చేరాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.8.55 లక్షల కోట్లు. ఒక నెలలో దేశం నుంచి జరిగిన అత్యధిక ఎగుమతులు ఇవేనని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు. 2025 అక్టోబరులో దేశ ఎగుమతులు 69.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు దిగుమతులు కూడా ఏడాది వ్యవధిలో పెరిగాయి. 2025 అక్టోబరులో 94.42 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. ఈ ఏడాది అక్టోబరులో 110.07 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఎగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు తగ్గింది.
వివరాలు
45 శాతం పెరిగిన వస్తు ఎగుమతులు
గతేడాది అక్టోబరులో 25.15 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు.. ఈసారి 20.09 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
అక్టోబరు నెలలో వస్తు ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందాయి. 2025 అక్టోబరులో 34.11 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3.24 లక్షల కోట్లు) ఉన్న వస్తు ఎగుమతులు.. ఈ ఏడాది అదే నెలలో 45 శాతం పెరిగి 49.47 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4.70 లక్షల కోట్లు) చేరాయి.
ఇదే సమయంలో వస్తు దిగుమతులు 76.69 బిలియన్ డాలర్ల నుంచి 89.35 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
అయితే పసిడి దిగుమతులు మాత్రం గణనీయంగా తగ్గాయి. గతేడాది అక్టోబరులో 14.72 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు.. ఈసారి 5.51 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
వివరాలు
సేవల ఎగుమతుల్లోనూ వృద్ధి
వస్తువులతో పాటు సేవల ఎగుమతులు కూడా పెరిగాయి.
అక్టోబరు నెలలో సేవల ఎగుమతులు 2025లోని 35.17 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాది 40.51 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా. అదే సమయంలో సేవల దిగుమతులు కూడా 17.73 బిలియన్ డాలర్ల నుంచి 20.72 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
రత్నాభరణాల ఎగుమతుల్లో 34 శాతం
వృద్ధి దేశ రత్నాభరణాల ఎగుమతులు కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి. అక్టోబరు నెలలో ఈ రంగం ఎగుమతులు 34.01 శాతం పెరిగి 2.92 బిలియన్ డాలర్లకు చేరాయి.
భారత కరెన్సీలో వీటి విలువ దాదాపు రూ.27,862.82 కోట్లు. ఈ వివరాలను జెమ్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) వెల్లడించింది.