Loading...
El Nino: ఎల్‌నినోతో ఆరోగ్య ముప్పు.. భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
ఎల్‌నినోతో ఆరోగ్య ముప్పు.. భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

El Nino: ఎల్‌నినోతో ఆరోగ్య ముప్పు.. భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వడగాలులు, కరవు, అంటువ్యాధులు, ఆహార కొరత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత్‌ను అధిక లేదా అత్యధిక ఆరోగ్య ముప్పు ఎదుర్కొనే దేశాల జాబితాలో చేర్చింది. దక్షిణాసియాలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.

వివరాలు 

డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర ప్రణాళిక

2026 అక్టోబర్‌ నుంచి 2027 సెప్టెంబర్‌ వరకు గ్రేడ్‌-3 స్థాయి అత్యవసర స్పందనను ప్రారంభించనున్నట్లు నవంబర్‌ 2న విడుదల చేసిన ప్రణాళికలో డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

వ్యాధుల గుర్తింపు, పర్యవేక్షణ, నివారణ, వైద్య సేవలు, సమన్వయంపై దృష్టి పెట్టనుంది.

తొలి ఆరు నెలల కార్యకలాపాల కోసం సుమారు 3.5 కోట్ల డాలర్ల నిధులు అవసరమని అంచనా వేసింది.

ఎల్‌నినో నేరుగా వ్యాధులకు కారణం కాకపోయినా, వాతావరణ మార్పుల ద్వారా ఆరోగ్య సమస్యలను పెంచే ప్రమాదం ఉందని వివరించింది.

వివరాలు 

భారత్‌కు పొంచి ఉన్న ఆరోగ్య ముప్పులు

తీవ్రమైన వడగాలుల వల్ల డీహైడ్రేషన్‌, వడదెబ్బతో పాటు గుండె, శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారికి ముప్పు ఎక్కువ. ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పుల వల్ల డెంగీ, మలేరియా వ్యాప్తి పెరగవచ్చు.

నీటి కొరత, పారిశుద్ధ్య లోపాలతో తాగునీరు కలుషితమై లెప్టోస్పిరోసిస్‌ వంటి వ్యాధులు వ్యాపించవచ్చు.

వర్షాలు తగ్గితే పంటల దిగుబడి దెబ్బతిని ఆహార కొరత, పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం ఉంది.

ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఆసుపత్రులు, ఔషధ సరఫరా వ్యవస్థలపైనా తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావం పడవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

రుతుపవనాలపై ప్రభావం

2026 నైరుతి రుతుపవనాల్లో దీర్ఘకాలిక సగటులో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

అయితే ఎల్‌నినో వస్తే రుతుపవనాలు పూర్తిగా విఫలమవుతాయని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో కరవు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

ముందస్తు చర్యలు అవసరం

వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.

మందుల నిల్వలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, సురక్షిత తాగునీటి సరఫరా, డెంగీ, మలేరియా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది.

వాతావరణ, ఆరోగ్య, విపత్తు నిర్వహణ విభాగాల మధ్య సమన్వయం అవసరమని తెలిపింది.

ఈ ముప్పు దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఒకేలా ఉండదని, స్థానిక వాతావరణ పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతను బట్టి ప్రభావం మారుతుందని స్పష్టం చేసింది.

ADVERTISEMENT