Andhra Pradesh: ఏపీలో రూ.800 కోట్ల పెట్టుబడితో ఆస్ట్రోబేస్ రాకెట్ టెస్టింగ్ కేంద్రం విస్తరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రానుంది. అంతరిక్ష రంగానికి చెందిన ప్రముఖ ప్రైవేట్ సంస్థ ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ రాష్ట్రంలో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రాకెట్ ఇంజిన్ పరీక్షలు, లాంచ్ వెహికల్స్ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను విస్తరించేందుకు ఈ నిధులను వెచ్చించనుంది. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026లో ఈ ప్రకటన వెలువడింది. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB)తో సంస్థ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
వివరాలు
అదనంగా మరో 339 ఎకరాల కేటాయింపు
ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా తిమ్మసముద్రంలో ఇప్పటికే ఉన్న రాకెట్ ఇంజిన్ టెస్టింగ్ కేంద్రాన్ని భారీగా విస్తరించనున్నారు.
ప్రస్తుతం ఈ కేంద్రం 22 ఎకరాల్లో ఉండగా.. అదనంగా మరో 339 ఎకరాలను కేటాయించనున్నారు.
దీంతో మొత్తం విస్తీర్ణం సుమారు 360 ఎకరాలకు చేరుతుంది.
ఈ విస్తరణతో దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రవాణా వ్యవస్థకు అవసరమైన పరీక్షలు, అభివృద్ధి కార్యకలాపాలకు మరింత విస్తృతమైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, హాట్ ఫైర్ పరీక్షల నిర్వహణకు అవకాశం
ఈ పెట్టుబడిపై ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు నీరజ్ ఖండేల్‌వాల్ స్పందించారు.
భారత్‌లోనే అత్యాధునిక అంతరిక్ష రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలన్న తమ లక్ష్యంలో ఈ విస్తరణ కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసే సదుపాయాలతో స్టాటిక్ హాట్-ఫైర్ టెస్టులు,రాకెట్ దశల స్థాయిలో హాప్ టెస్టులు వంటి క్లిష్టమైన పరీక్షలను నిర్వహించవచ్చని వివరించారు.
అంతేకాకుండా తిరిగి ఉపయోగించగల రాకెట్ల (రీయూజబుల్ లాంచ్ వెహికల్స్) సాంకేతికత అభివృద్ధికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని చాటుకుందని నీరజ్ ఖండేల్‌వాల్ అన్నారు.
భవిష్యత్తులో ఉపగ్రహాలు, పేలోడ్లను మరింత తరచుగా, నమ్మకంగా అంతరిక్షంలోకి పంపించడమే తదుపరి లక్ష్యమని తెలిపారు.
వివరాలు
500 మందికి ప్రత్యక్షంగా, మరో 1,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు
ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో విస్తరించిన పరీక్షా కేంద్రం కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
సుమారు 500 మందికి ప్రత్యక్షంగా, మరో 1,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
కాగా, ఆస్ట్రోబేస్ సంస్థ ఇటీవలే కర్ణాటకలోనూ రూ.500 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది.
బెంగళూరులో ఎవరెస్ట్ ఇంజిన్, AB220 మీడియం-లిఫ్ట్ లాంచ్ వెహికల్ అభివృద్ధికి అవసరమైన అధునాతన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్‌లో మరో రూ.800 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకోవడం గమనార్హం.
వివరాలు
సదస్సును CII,DPIIT సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి
మరోవైపు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) సంయుక్తంగా ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వ ఆతిథ్యంలో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.