LOADING...
Adani Group: 'మేకిన్ ఇండియా'కు ఊతం.. హెలికాప్టర్ తయారీకి అదానీ-లియోనార్డో ఒప్పందం
'మేకిన్ ఇండియా'కు ఊతం.. హెలికాప్టర్ తయారీకి అదానీ-లియోనార్డో ఒప్పందం

Adani Group: 'మేకిన్ ఇండియా'కు ఊతం.. హెలికాప్టర్ తయారీకి అదానీ-లియోనార్డో ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ ఇప్పుడు హెలికాప్టర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయెర్ సంస్థతో కలిసి భారత్‌లో విమానాల తయారీ వ్యవస్థ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం చేసుకున్న అదానీ గ్రూప్‌... తాజాగా ఇటలీకి చెందిన లియోనార్డో కంపెనీతో హెలికాప్టర్ తయారీ ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు భాగస్వామ్యాన్ని ఖరారు చేసింది. ఈ ఒప్పందం 'మేకిన్ ఇండియా' కార్యక్రమానికి బలాన్ని చేకూర్చడంతో పాటు దేశ స్వావలంబన దిశగా మరో కీలక అడుగుగా నిలవనుంది. ఈ మేరకు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్‌, లియోనార్డో సంస్థల ప్రతినిధులు మంగళవారం అధికారికంగా ఒప్పందంపై సంతకాలు చేశారు.

వివరాలు 

భారత సైన్యం, భారత వైమానిక దళాల అవసరాలను తీర్చడమే లక్ష్యం

ఈ భాగస్వామ్యం కింద దేశంలో సమగ్ర హెలికాప్టర్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా భారత సైన్యం, భారత వైమానిక దళాల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ సహకారం సాగనుంది. లియోనార్డో కంపెనీకి చెందిన AW169M, AW109 TrekkerM హెలికాప్టర్లను భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించారు. దశలవారీగా స్థానిక తయారీ వాటాను పెంచడంతో పాటు నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్‌ (MRO) సామర్థ్యాల అభివృద్ధి, పైలట్ల శిక్షణ వంటి అంశాలూ ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయని అదానీ గ్రూప్‌ తన ప్రకటనలో వెల్లడించింది.

వివరాలు 

పరిమితంగానే భారత్‌లో హెలికాప్టర్ల వినియోగం

ప్రస్తుతం భారత్‌లో హెలికాప్టర్ల వినియోగం పరిమితంగానే ఉందని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా 250కంటే తక్కువ హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయని,అయితే వచ్చే పదేళ్లలో ప్రతి సంవత్సరం సగటున 100హెలికాప్టర్ల అవసరం ఏర్పడే అవకాశముందని అంచనా వేసింది. రాబోయే దశాబ్దంలో సాయుధ దళాల అవసరాల కోసం వెయ్యికి పైగా హెలికాప్టర్లు కావాల్సి రావచ్చని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈఓ అశీష్ రాజ్‌వంశీ పేర్కొన్నారు. ఈభాగస్వామ్యం ద్వారా దేశంలో సివిల్‌,డిఫెన్స్ రంగాల అవసరాలను తీర్చే దృఢమైన పునాది వేసినట్లు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ అదానీ తెలిపారు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటని,సాయుధ దళాల్లో హెలికాప్టర్ల డిమాండ్ వేగంగా పెరుగుతోందని లియోనార్డో హెలికాప్టర్స్ ఎండీ గియాన్ పియరో కుటిల్లో ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.

Advertisement