దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ
హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల విషయంలో గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం అదానీ స్టాక్స్ దూసుకుపోయాయి. అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీ పెరుగుదలని చూశాయి. దీంతో అదానీ కంపెనీల షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్లు దాటింది. ఫలితంగా అదానీ గ్రూప్‌లోని షేర్లు ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు.
నిఫ్టీ 50లో టాప్ గెయినర్లుగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్
అదానీ గ్రూప్ లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 19.55శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్ 6.41% వృద్ధి చెంది రూ.732.20 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ 50లో ఈ రెండు స్టాక్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అదానీ విల్మార్ దాదాపు 10 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్, ఎన్‌డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం వరకు ర్యాలీ చేశాయి. ఇదిలా ఉండగా, అంబుజా సిమెంట్ 6.5 శాతానికి పైగా, ఏసీసీ 5.6 శాతానికి పైగా బలపడ్డాయి.