Adani Green: గౌతమ్ అదానీ,సాగర్ అదానీలపై US ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అభియోగాల్లేవ్: అదానీ గ్రీన్
అదానీ గ్రూప్, అనుబంధ సంస్థలపై సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందడంలో భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికాలో కేసు నమోదవడం ఇటీవల సంచలనంగా మారింది. ఈ విషయంపై తాజాగా అదానీ గ్రూప్‌లోని గ్రీన్ ఎనర్జీ సంస్థ వివరణ ఇచ్చింది. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్‌లపై లంచం ఆరోపణలు ఉన్నాయన్న వార్తలు అసత్యమని సంస్థ స్పష్టం చేసింది.
ముగ్గురిపై సెక్యూరిటీస్ మోసం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి: అదానీ గ్రీన్
స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్పందిస్తూ, "అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA) కింద గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అలాగే కంపెనీ సీనియర్ డైరెక్టర్ వినీత్ జైన్‌లపై లంచం, అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న వార్తలు నిజం కావు. మేము ఈ కథనాలను తిరస్కరిస్తున్నాం.ఈ ముగ్గురిపై సెక్యూరిటీస్ మోసం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, ఎఫ్‌సీపీఏ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అమెరికా న్యాయశాఖ కేసులో వీరి పేర్ల ప్రస్తావన లేదు" అని వెల్లడించింది.
కేసు విషయంలో న్యాయపరమైన చర్యలు
అదానీ, సాగర్ అదానీతో పాటు ఇతర వ్యక్తులు 2020-24 మధ్య కాలంలో భారత ప్రభుత్వ అధికారులకు ₹2,200 కోట్లు (265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారని న్యూయార్క్ కోర్టులో నేరారోపణలు నమోదయ్యాయి. ఈ లంచాలు లాభదాయకమైన సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలను పొందేందుకు ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అజూర్ పవర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కాబనేస్‌లపై యూఎస్ ఎస్‌ఈసీ (US SEC) అభియోగాలు నమోదు చేసింది. తాజాగా,గౌతమ్,సాగర్ అదానీలకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సమన్లు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. కేసు విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.