Uber: ఉబర్ ఉద్యోగులకు షాక్.. ఇక వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ టెక్నాలజీస్ (Uber Technologies) ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. ఇటీవల భారీగా ఉద్యోగాల కోత చేపట్టిన సంస్థ.. ఇప్పుడు వర్క్ ఫ్రం హోం (WFH) విధానంపై మరింత కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పనిచేసే అవకాశం కేవలం 1 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల గ్లోబల్ స్థాయిలో తమ సిబ్బందిలో దాదాపు 10శాతం మందిని ఉబర్ తొలగించింది. ఈ నిర్ణయంతో సుమారు 3,300 మంది కార్పొరేట్ ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిణామం తర్వాత కంపెనీ పని విధానంలోనూ మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే రిమోట్ వర్క్‌పై కొత్త ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
వివరాలు
వారానికి మూడు రోజులు ఆఫీసుకు..
ఇకపై ఉబర్‌లోని ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులైనా తప్పనిసరిగా కార్యాలయానికి హాజరుకావాలి.
ప్రస్తుతం పూర్తిగా రిమోట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ బృందాలతో కలిసి పనిచేసేందుకు అవసరమైన ప్రాంతాలకు మారాలని కంపెనీ సూచించింది.
ఉద్యోగుల కోసం న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లో ప్రత్యేక కార్యాలయ హబ్‌లను ఇప్పటికే ఏర్పాటు చేసింది.
మేనేజర్లు, వారి కింద పనిచేసే ఉద్యోగులు ఒకే ప్రాంతంలో ఉండేలా పని విధానాన్ని మార్చాలని ఉబర్ భావిస్తోంది.
దీనివల్ల టీమ్‌ల మధ్య సమన్వయం మెరుగుపడటంతో పాటు.. ఉద్యోగులు, మేనేజర్ల మధ్య ప్రత్యక్ష సహకారం పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.
వివరాలు
పెట్టుబడులపై సమీక్ష..
మేనేజ్‌మెంట్‌లో ఉన్న అనవసరమైన లేయర్లను తొలగించడంతో పాటు సంస్థ వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడంలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు ఉబర్ తెలిపింది.
ముఖ్యంగా రైడ్ షేరింగ్, డెలివరీ, రోబోట్యాక్సీ వ్యాపారాల్లో చేస్తున్న పెట్టుబడులను కూడా సంస్థ సమీక్షిస్తోంది.
ఇటీవల చేపట్టిన ఉద్యోగాల కోత, మేనేజ్‌మెంట్ నిర్మాణంలో మార్పులు, వ్యాపార పెట్టుబడుల పునఃసమీక్ష.. ఇవన్నీ సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థంగా మార్చే ప్రక్రియలో భాగమని ఉబర్ పేర్కొంది.
కార్పొరేట్ ఉద్యోగులకే నిబంధనలు..
అయితే ఈ కొత్త వర్క్ ఫ్రం హోం నిబంధనలు ఉబర్‌లోని కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి.
కంపెనీ కోసం క్యాబ్‌లు నడిపే డ్రైవర్లు, ఇతర సిబ్బందిపై ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రభావం ఉండదని ఉబర్ స్పష్టం చేసింది.