Goldman Sachs: ఏఐ ప్రభావంతో భారత్‌లో డేటా సెంటర్ల బూమ్.. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో భారత్ కీలక స్థానాన్ని సంపాదించిందని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ తాజా నివేదిక వెల్లడించింది. ఆసియా ప్రాంతంలో భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు డేటా సెంటర్ల రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లుగా ఎదుగుతున్నాయని పేర్కొంది. దేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం పెరగడం, క్లౌడ్ సేవల విస్తరణ, డేటా స్థానికీకరణ నిబంధనల అమలు వంటి అంశాలు డేటా సెంటర్ల రంగానికి ప్రధాన బలంగా మారాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణతో పాటు ఏఐ ఆధారిత సాంకేతికతల వినియోగం పెరుగుతుండటం కూడా ఈ రంగ అభివృద్ధికి ఊతమిస్తోంది.
వివరాలు
డేటా సెంటర్ హబ్‌లుగా ముంబయి, చెన్నై
భారత్‌కు అనుకూలమైన భౌగోళిక పరిస్థితులు,పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పశ్చిమాసియా మార్కెట్లకు సమీపంలో ఉండటం వంటి అంశాలు కూడా డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని నివేదిక పేర్కొంది. దీంతో దేశంలో ఈ రంగం వేగంగా విస్తరిస్తోందని విశ్లేషించింది. ప్రస్తుతం దేశంలో ముంబయి, చెన్నై ప్రధాన డేటా సెంటర్ హబ్‌లుగా కొనసాగుతున్నాయి. వీటి తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు నగరాలు ఉన్నాయి. సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల లభ్యత ఈ నగరాలకు అదనపు ప్రయోజనంగా మారింది. అంతర్జాతీయ డేటా కనెక్టివిటీకి ఇవి కీలక కేంద్రాలుగా నిలుస్తున్నాయి.
వివరాలు
నిర్మాణ దశలో 0.32గిగావాట్ల సామర్థ్యంతో కొత్త డేటా సెంటర్లు
ఏఐ వినియోగం వేగంగా పెరుగుతుండటంతో డేటా సెంటర్ల రూపకల్పన,నిర్మాణం,విక్రయ విధానాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ పేర్కొంది. కొత్త సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కస్టమర్ల డిమాండ్,ప్రాజెక్టుల కాలపరిమితులు,మౌలిక సదుపాయాల అవసరాలు కూడా మారుతున్నాయని తెలిపింది. ఇక నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం,దేశంలోని డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం 2025 చివరి నాటికి 1.6గిగావాట్లను అధిగమించింది. ప్రస్తుతం 0.32గిగావాట్ల సామర్థ్యంతో కొత్త డేటా సెంటర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అదేవిధంగా మరో 2.92గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన ప్రాజెక్టులపై పెట్టుబడి చర్చలు కొనసాగుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్ మౌలిక వసతులపై పెరుగుతున్న పెట్టుబడులు డేటా సెంటర్ల రంగాన్ని మరింత వేగంగా ముందుకు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.