Artificial intelligence: ఏఐ వల్ల ఉద్యోగాలు అంతరించవు.. పునీత్ చందోక్ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ(ఏఐ)కారణంగా ఉద్యోగాలు పూర్తిగా పోవని, అయితే ఆ సాంకేతికతను నేర్చుకోవడంలో వెనకడుగు వేస్తే మాత్రం భవిష్యత్తులో అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఇండియా-దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ స్పష్టం చేశారు. ఒక ఉద్యోగానికి సంబంధించిన పనులను కొత్త తరం ఏఐ సాంకేతికత వేర్వేరుగా విభజిస్తుందని ఆయన వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్‌లో పాల్గొన్న వారిని ఉద్దేశించి పునీత్ చందోక్ మాట్లాడుతూ స్థిరమైన, దీర్ఘకాలం పాటు ఒకే వృత్తిలో కొనసాగించే చివరి తరం మనదే కావచ్చు. మన పిల్లలు భవిష్యత్తులో ఒకేసారి పలు ఉద్యోగాలను నిర్వహించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ రోజూ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని,కొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Details
నైపుణ్యాలే అసలు ఆయుధం
'ఆక్సిజన్ మాస్క్ ఎలా ధరించాలో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా అంటూ ఆయన ఉదాహరణ ఇచ్చారు. దిల్లీలో పెరుగుతున్న కాలుష్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏఐ మోడళ్లు భవిష్యత్తులో కంపెనీలకు ఒక ఉత్పత్తిగా మారతాయని, డేటా మాత్రం వ్యూహాత్మక ఆస్తిగా రూపాంతరం చెందుతుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ ఏఐ టూల్స్‌ను సైబర్ భద్రత రంగంలో విస్తృతంగా వినియోగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అదానీ సిమెంట్, యెస్ బ్యాంక్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఏఐ క్లయింట్లుగా ఉన్నాయని సత్య నాదెళ్ల వెల్లడించారు.