Air Force: ఎయిర్ ఫోర్స్ వన్ ప్రాజెక్ట్‌తో బోయింగ్‌కు రూ.3 బిలియన్ డాలర్లకుపైగా నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానమైన ఎయిర్ ఫోర్స్ వన్ నిర్మాణ ప్రాజెక్ట్ బోయింగ్ సంస్థకు భారీ నష్టాలను మిగులుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో 280 మిలియన్ డాలర్ల నష్టాన్ని బోయింగ్ ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు కంపెనీ భరించిన అదనపు వ్యయం 3 బిలియన్ డాలర్లను దాటిందని సంస్థ సీఈఓ కెల్లీ ఆర్ట్‌బర్గ్ వెల్లడించారు. రెండు ప్రత్యేక సైనిక అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్న బోయింగ్ 747 విమానాల నిర్మాణం, పరీక్షల ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు సిబ్బంది,సాంకేతిక వనరులను వినియోగించాల్సి రావడంతో ఈ ఖర్చులు పెరిగినట్లు ఆయన తెలిపారు. తమ ప్రధాన కస్టమర్ అయిన అమెరికా ప్రభుత్వానికి సమయానికి విమానాలను అందించడం అత్యంత కీలకమని,అందుకే అవసరమైన పెట్టుబడులు కొనసాగిస్తున్నామని చెప్పారు.
వివరాలు
రెండు బోయింగ్ 747-200 జంబో జెట్లు ఎయిర్ ఫోర్స్ వన్‌గా కొనసాగుతున్నాయి
2018లో అమెరికా ప్రభుత్వంతో కుదిరిన 3.9 బిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టులో వచ్చే అదనపు ఖర్చులన్నింటినీ బోయింగ్ సంస్థే భరించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా, అమెరికా ప్రభుత్వ పర్యవేక్షణ సంస్థ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (GAO) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత షెడ్యూల్ కంటే దాదాపు మూడు సంవత్సరాలు వెనుకబడిందని పేర్కొంది.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి అధికారిక ప్రయాణాల కోసం 1990ల నుంచి సేవలందిస్తున్న రెండు బోయింగ్ 747-200 జంబో జెట్లు ఎయిర్ ఫోర్స్ వన్‌గా కొనసాగుతున్నాయి.
వివరాలు
2028 నాటికి కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలే లక్ష్యం
ఇటీవల ఖతార్ బహుమతిగా ఇచ్చిన సుమారు 400 మిలియన్ డాలర్ల విలాసవంతమైన విమానాన్ని తాత్కాలికంగా అధ్యక్షుడి ప్రయాణాల కోసం ఉపయోగించినప్పటికీ, ఈ నెల ప్రారంభంలో క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థల ఏర్పాటు కోసం దాన్ని సేవల నుంచి తప్పించారు.
అత్యాధునిక కమ్యూనికేషన్, భద్రతా వ్యవస్థలతో కూడిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల అభివృద్ధి అత్యంత క్లిష్టమైనదిగా, భారీ వ్యయంతో కూడుకున్నదిగా నిపుణులు చెబుతున్నారు.
అన్ని సవాళ్లను అధిగమించి 2028 నాటికి కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందించాలనే లక్ష్యంతో బోయింగ్ పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.