Air India Board: నష్టాల భారంలో ఎయిర్ ఇండియా.. వ్యయ నియంత్రణపై కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో విమాన ఇంధన ధరలు పెరగడం, విదేశీ మార్గాల్లో నేరుగా ప్రయాణం సాధ్యంకాక చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడం వంటి కారణాలతో ఎయిర్ ఇండియా సంస్థ ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యలపై సంస్థ బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. ఉద్యోగులకు తాత్కాలికంగా సెలవులు ఇవ్వడం, బోనస్ చెల్లింపులను వాయిదా వేయడం వంటి ప్రతిపాదనలు కూడా పరిశీలనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా సమూహానికి రూ.22,000 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వ్యయాలను తగ్గించే మార్గాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
వివరాలు
2025-26 ఆర్థిక గణాంకాలు, ఖర్చు నియంత్రణ చర్యల అంశాలపై బోర్డు చర్చలు
హరియాణాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం 11:30 గంటలకు బోర్డు సమావేశం ప్రారంభమై, దాదాపు మూడు గంటల పాటు కొనసాగిందని సమాచారం. అయితే చర్చల వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే 2025-26 ఆర్థిక గణాంకాలు, ఖర్చు నియంత్రణ చర్యలు వంటి కీలక అంశాలపై బోర్డు సభ్యులు చర్చించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఉద్యోగులను వేతనం లేని సెలవుల్లోకి పంపడం, బోనస్ చెల్లింపులను వాయిదా వేయడం వంటి చర్యలను కూడా పరిశీలించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ఎన్ చంద్రశేఖరన్ నాయకత్వం వహించారు.
వివరాలు
సమావేశంలో కొత్త ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఎంపిక ప్రస్తావన
ఇదే సమయంలో కొత్త ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఎంపిక అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుత సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ ఈ ఏడాదిలోనే పదవి నుంచి వైదొలగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన శుక్రవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.