Air India: విస్తారా విలీనానికి ముందు.. ఎయిర్ ఇండియా మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు
విస్తారా ఎయిర్‌లైన్స్‌తో ఎయిర్ ఇండియా విలీనానికి ముందు మేనేజ్‌మెంట్‌లో మార్పులు జరుగుతున్నాయి. టాటా గ్రూప్‌లోని ఈ రెండు సంస్థల విలీనంతో ఎయిర్ ఇండియా కార్యకలాపాల్లో కీలక మార్పులు జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం విస్తారా సీఈఓగా ఉన్న వినోద్ కనన్, విలీన తర్వాత చీఫ్ ఇంటిగ్రేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్‌కు ప్రత్యక్షంగా నివేదికలు అందించనున్నారు. ఇందులో భాగంగా, వినోద్ కనన్ మేనేజింగ్ కమిటీలో సభ్యునిగా చేరనున్నారు. విస్తారాలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా ఉన్న దీపక్ రాజావత్, విలీన కంపెనీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1శాతం వాటా
విస్తారా నుండి హామిష్ మ్యాక్స్‌వెల్ కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలొక్ సింగ్‌కు సలహాదారుడిగా ఎంపికయ్యాడు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఉన్న పుష్పిందర్ సింగ్ తిరిగి ఫ్లయింగ్ డ్యూటీస్‌లోకి వెళ్తున్నారు. విస్తారాలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ దీపా చద్దా, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వినోద్ భట్ టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థల్లో సీనియర్ పాత్రలను స్వీకరించనున్నారు. జూన్‌లో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఈ విలీనాన్ని ఆమోదించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ గ్రూప్‌లలో ఒకటిగా మారనుంది. విలీనానికి తర్వాత, సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1శాతం వాటాను, టాటా సన్స్ 73.8 శాతం వాటాను పొందుతాయి.